చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను సిబ్బంది కంటికి రెప్పలా కాపాడాల్సి ఉంటుంది. కానీ అంగన్‌వాడీ టీచర్, సిబ్బంది నిర్లక్ష్యం.. బాలుడినే మింగేసింది. అంగన్‌వాడీకి పంపిస్తే.. నాలుగేళ్ల చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ఆ చిన్నారికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడుకు చెందిన జగదీష్, శ్రావణి దంపతులు హైదరాబాద్‌లో పిల్లర్ గుంతలు, పైపులైన్ గోతులు తీసే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జగదీష్ కుటుంబం స్వగ్రామానికి వచ్చింది. కాసనగోడులో సరిపడా చిన్నారులు లేకపోవటంతో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. జగదీష్, శ్రావణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు నాలుగేళ్ల అయాన్ ను.. తల్లి శ్రావణి అంగన్వాడీ కేంద్రంలో ఉదయం వదిలి వెళ్ళింది. మధ్యాహ్నం బాలుడు బహిర్భూమికి వెళ్లాలనీ ఆయాకు చెప్పాడు. అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మరుగుదొడ్లు ఉన్నాయి. కానీ అంగన్వాడీ కేంద్రానికి 300మీటర్ల దూరంలోనీ ప్రాంతానికి బాలుడిని బహిర్భూమికి ఆయా తీసుకువెళ్లింది. బహిర్భూమి అనంతరం అయాన్ కడుక్కునేందుకు పక్కనే ఉన్న నీటి గుంత వద్దకు వెళ్ళాడు.
ఇటీవలి వర్షాలతో ఆ ప్రాంతం పాకురు పట్టి ఉండడంతో అయాన్ పట్టుతప్పి నీటి గుంతలో పడిపోయాడు. దీంతో ఆయా భయంతో కేకలు వేసింది. చుట్టు పక్కల యువకులు నీటి గుంతలోకి దిగి బాలుడిని అయాన్ ను వెతికి బయటకు తీశారు. అప్పటికే ఆయాన్ ఊపిరాడక విగతజీవిగా మారిపోయాడు. అంగన్వాడీ టీచర్, ఆయా నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు చనిపోయాడని బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
బాలుడి మృతదేహంతో అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట రాత్రి ఆందోళన చేశారు. ఈ ఘటనపై కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంగన్‌వాడీ టీచర్ల, ఆయాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు
Also read
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..
- Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే
- అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్





