ఏలిన్నాటి, అష్టమ శని దోషాలే కాకుండా, శని దృష్టి పడిన వృషభం, కన్య, ధనుస్సు, మీన రాశులకు 2027 జూన్ వరకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్యం చెబుతోంది. మీనంలో శని సంచారం వల్ల ఈ నాలుగు రాశులవారు ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, ఆర్థిక విషయాల్లో కష్టనష్టాలు, ఆలస్యాలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండటం మంచిది.
Shani Dosha: ఏలిన్నాటి శని, అష్టమ శని వంటి శని దోషాలు ఎంతగా కష్టనష్టాలకు గురి చేస్తాయో, శని దృష్టి పడిన రాశులకు కూడా అంతగా కష్టనష్టాలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శనీశ్వరుడు తానున్న రాశి నుంచి 3, 7, 10 రాశులను వీక్షిస్తాడు. తానున్న రాశితో పాటు మరో మూడు రాశులకు తన దృష్టితో ఇబ్బందులు కలిగిస్తాడు. ఫలితంగా నాలుగు రాశులవారికి శని మీన రాశిలో ఉన్నంతవరకు సమస్యలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. శని మీన రాశి నుంచి వృషభం, కన్య, ధనూ రాశుల మీద దృష్టి సారించడం జరుగుతోంది. ఈ రాశులవారు కొన్ని విషయాల్లో 2027 జూన్ వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
వృషభం: ఈ రాశిని శని లాభ స్థానం నుంచి వీక్షించడం వల్ల ఈ రాశివారికి ప్రతి విషయంలోనూ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది కానీ శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కూడా నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి, పదోన్నతులకు బాగా అవకాశం ఉన్నప్పటికీ, వాటి కోసం ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఆలస్యంగా ఫలితాలు అందుతాయి.
కన్య: ఈ రాశికి సప్తమ స్థానం మీద శని దృష్టి వల్ల పెళ్లి ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆశా భంగాలు, నిరాశా నిస్పృహలు ఎక్కువగా కలుగుతాయి. అతి కష్టం మీద అత్యున్నత స్థాయి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా తరచూ అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో యాక్టివిటీ పెరగకపోవచ్చు. వ్యాపారాల్లో భాగస్వాములతో మధ్య మధ్య సమస్యలు తప్పవు. విదేశీయానానికి ఆటంకాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.
ధనుస్సు: ఈ రాశి మీద శని దృష్టి వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు. శుభకార్యాలకు ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులు ఇబ్బంది పెడతాయి. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నాలు ఒకపట్టాన ముందుకు సాగకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతుంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి.
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాదు. శ్రమ, తిప్పట పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం తగ్గడంతో పాటు పని భారం పెరుగు తుంది. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గతంలో అనేక విధాలుగా సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద తప్ప ఇతర లౌకిక విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది
Also read
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 - Telangana: బెట్టింగ్ యాప్‌కు కానిస్టేబుల్ బలి..! పోలీస్ స్టేషన్‌లోని పిస్టల్ తీసుకొని అకస్మాత్తుగా..
 





