నల్లమల అటవీ ప్రాంతంలోని అదో రైల్వే స్టేషన్.. తెల్లవారుజాము 4 గంటల సమయం.. పోలీస్ వాహనాలు సైరన్‌తో రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు.. వాహనాల్లోని సిబ్బంది దిగి.. అనుమానాస్పదంగా తిరుగుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వేలిముద్రలను పరిశీలించారు. తమ దగ్గర ఉన్న ఓ ప్రత్యేకమైన స్కానర్ ద్వారా అనుమానితుల వేలిముద్రలు నేరస్థుల వేలిముద్రలతో సరిపోలుతున్నాయా.. లేదా అన్నది సరిచూశారు.. రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న ఈ తంతును గమనించిన ప్రయాణీకులు ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో గమనించారు. ఇదంతా నేరస్థుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలుగా తెలుసుకుని హమ్మయ్య అనుకున్నారు. నేరస్థుల ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసుశాఖ రూపొందించిన ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఈ తనిఖీలు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పోలీసులు అపరిచిత వ్యక్తుల వేలిముద్రలను సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేసి విచారించారు. గిద్దలూరు ఎస్ఐ నాగరాజు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు వారి వేలిముద్రలను పోలీసుల సాఫ్ట్వేర్ ఏఎఫ్‌ఐఎస్ లో పరిశీలించారు. నేరాల నియంత్రణ కొరకు ఎస్‌పి హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాల మేరకు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.

అసలేంటి ఈ ఏఎఫ్‌ఐఎస్..
ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను AFISగా పిలుస్తారు… అప్పటికే సేకరించిన లక్షలాదిమంది వేలిముద్రలను నిల్వ చేసి కంప్యూటరీకరిస్తారు. వేలిముద్రల గుర్తింపును అధునాతన సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన పద్ధతిలో ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ ద్వారా నేరస్థుల వేలిముద్రలను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. నేరం జరిగిన ప్రాంతంలో సేకరించిన వేలి ముద్రలను అప్పటికే సేకరించిన నేరస్థుల వేలిముద్రలతో సరిపోల్చి నేరం చేసింది ఎవరైందీ గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అనుమానితులను విచారించి వారి వేలిముద్రలను తమ దగ్గర ఉన్న డేటా ద్వారా అక్కడికక్కడే గుర్తించేందుకు సహాయపడుతుంది. తద్వారా నేరాల నియంత్రణకు ఈ సాఫ్ట్‌వేర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో నేరస్థులను సులభంగా కనిపెట్టవచ్చు.. పోలీసుల నేర నియంత్రణకు ఈ సాఫ్ట్‌వేర్ ఓ అస్త్రం లాంటిదే.
Also read
- సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
- ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
- Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
- ఇంకా వీడని నిజామాబాద్ మహిళ మర్డర్ మిస్టరీ.. తల, చేతి వేళ్లు మాయం!
- విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది





