SGSTV NEWS
CrimeTelangana

Nalgonda: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్ ఉంది.. కానీ రాత్రి నిద్రలోనే వారి జీవితాలు…



మెరుగైన జీవితం కోసం ఆ కుటుంబం ఎన్నో కలలు కన్నది. తమ కలలను నిజం చేసుకునేందుకు ఓ ప్రయత్నం చేసింది. తెల్లారితే తమ కల సాకారమవుతుందనే సంతోషంతో నిద్రపోయింది ఓ కుటుంబం. కానీ ఆ ప్రయత్నమే కుటుంబానికి శాపంగా మారింది. తెల్లవారేసరికి ఆ కుటుంబానికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా మాడుగులపల్లికి చెందిన వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్ మెన్‌గా పని చేస్తున్నారు. భార్య నాగమణి, కొడుకు విరాట్ కృష్ణ, కూతురు నందిని, తల్లి పార్వతమ్మతో కలిసి మాడుగులపల్లిలో ఉంటున్నాడు. పిల్లలకు చదువులు చెప్పించి, మంచి జీవితం ఇవ్వాలని కలలు కన్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో ఆర్థికంగా నిలుదొక్కుకోవాలనీ భావించాడు. ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాడు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కేఫ్ ఏర్పాటుకు ప్లాన్ చేశాడు. తన వద్ద ఉన్న డబ్బులతో పాటు కొంత అప్పు తీసుకొచ్చి ఒక హోటల్ రెంటుకు తీసుకొని డాన్ కిట్ ఫిల్టర్ కాఫి కేఫ్ ఏర్పాటు చేశాడు. ఈ కేఫ్‌‌ను ఆదివారం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. కేఫ్ కోసం రేకుల షెడ్‌పై వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశాడు. రాత్రి వాటర్ ట్యాంక్‌ను నీటితో నింపి కుటుంబంతో కలిసి కేఫ్‌లోనే వెంకన్న పడుకున్నాడు.

రెండు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ బరువును ఆపలేక రేకుల షెడ్డు పైకప్పు నిద్రిస్తున్న వెంకన్న కుటుంబంపై కూలింది. ఈ ఘటనలో వెంకన్న భార్య నాగమణి (32), కొడుకు విరాట్ కృష్ణ (6) చనిపోగా, వెంకన్నతో పాటు కూతురు నందిని, తల్లి పార్వతమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. తెల్లవారితే కేఫ్‌ను ప్రారంభించాల్సింది ఉండగా.. వారి జీవితాలు నిద్రలోనే తెల్లారిపోయాయి. కేఫ్ వెంకన్న కుటుంబానికి శాపంగా మారిందని బంధువులు వాపోతున్నారు.

వెంకన్న కుటుంబ సభ్యుల మృతితో మాడుగులపల్లిలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts