SGSTV NEWS
Andhra PradeshCrime

చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

కోనసీమ జిల్లాలో విషాద ఘటన

బంధువులే కారణమంటూ సెల్ఫీ వీడియో



ఆలమూరు: కుటుంబ కలహాలు, బంధువుల వేధింపులతో కన్న పిల్లలను చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పావులూరి కామరాజు అలియాస్ చంటి(36), నాగదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. చంటి సెలూన్ షాపు నిర్వహిస్తుంటాడు. కుటుంబంలో మనస్పర్ధలతో నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది.

ఇటీవల కుటుంబంలో కలహాలు, బంధువుల వేధింపులు ఎక్కువవయ్యాయి. దీంతో చంటి తన ఇద్దరు కుమారులు అభిరామ్ (11), గౌతమ్ (8)తో పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. కాగా, ఆత్మహత్యకు తన బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రోలు తలుపులు, కొరుప్రోలు శ్రీనివాసు వేధింపులే కారణమని చంటి ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

ఇటీవల వేధింపులు అధికమయ్యామని, వారంతా తనను చంపేందుకు యత్నిస్తున్నారని వీడియోలో వాపోయాడు. తాను చనిపోతే తన కుమారులను ఎవ్వరూ పట్టించుకోరనే ఉద్దేశంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆలమూరు పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts