SGSTV NEWS
Spiritual

Shankh Vastu Tips: పూజ గదిలో ఖాళీ శంఖం ఉంచడం అశుభం.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజూ ఇలా చేయండి..



సనాతన ధర్మంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల్లో శంఖాన్ని లక్ష్మీదేవి చిహ్నంగా పేర్కొన్నాయి. అందుకనే శంఖం దేవతలకు ఇష్టమైనదిగా భావిస్తారు. మతపరమైన దృక్కోణంలో ఇది చాలా శుభ చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే ఇంటి పూజ గదిలో లేదా ఇంటిలో ప్రార్థనా స్థలంలో శంఖం పెట్టుకోవడానికి కొన్ని నియమాలున్నాయి.. ముఖ్యంగా ఖాళీ శంఖాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు. ఎందుకో మీకు తెలుసా?


హిందూ మతం, వాస్తు శాస్త్రంలో శంఖాన్ని చాలా పవిత్రంగా, లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. శంఖం నుంచి వచ్చే శబ్దం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. అయితే శంఖం ఇంట్లో పెట్టె విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి విఫలమైతే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. ఈ నియమాలలో ఒకటి పుజగదిలో పెట్టిన శంఖాన్ని ఖాళీగా ఉంచకూడదు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పు ఆర్థిక నష్టం, పేదరికానికి దారితీస్తుంది. పూజ గదిలో ఖాళీ శంఖాన్ని ఉంచడం ఎందుకు అశుభంగా భావిస్తారు? పేదరికాన్ని నివారించడానికి ప్రతిరోజూ ఏమి చేయాలో తెలుసుకుందాం.

ఖాళీ శంఖాన్ని ఎందుకు అశుభంగా భావిస్తారంటే..

శంఖాన్ని దైవంతో సమానంగా భావిస్తారు. పురాణ గ్రంథాల ప్రకారం శంఖంలో దైవిక శక్తి , శుభం ఉంటుంది. మనం శంఖాన్ని ఏ వస్తువు లేకుండా ఖాళీగా ఉంచినప్పుడు.. అది దాని శుభం , దైవిక శక్తిని కోల్పోతుందని నమ్ముతారు.

ప్రతికూల శక్తి ప్రవాహం: వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఆలయంలో లేదా ఇంట్లో ఖాళీ శంఖాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ శూన్యత ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది

లక్ష్మీదేవి అసంతృప్తి: శంఖాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఎందుకంటే శంఖం సముద్ర మథనం సమయంలో ఉద్భవించింది. ఖాళీ శంఖాన్ని ఉంచడం వలన లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుంది. లక్ష్మీదేవి ఆ స్థలాన్ని ఖాళీ చేస్తుంది. దీంతో ఇంటిలోని సంపద, శ్రేయస్సును తొలగిపోతుంది. అందువల్ల శంఖాన్ని ఖాళీగా ఉంచడానికి బదులుగా.. దాని శక్తిని , సానుకూలతను కాపాడుకోవడానికి దానిని ఎల్లప్పుడూ స్వచ్చమైన నీటితో నింపాలి.

నీటితో నింపండి: మీ ఉదయం పూజకు ముందు లేదా పూజ చేసే సమయంలో.. శంఖాన్ని శుభ్రం చేసి గంగా జలం లేదా స్వచ్ఛమైన నీటితో నింపండి. ఈ నీటి స్వచ్ఛత శంఖానికి సానుకూల శక్తిని అందిస్తుంది. దాని దైవిక శక్తిని చురుకుగా ఉంచుతుంది.

నీరు చిలకరించడం: మర్నాడు ఆ శంఖంలోని నీటిని వృధా చేయకండి. శంఖంలోని నీటిని ఇల్లు అంతటా చల్లుకోండి. శంఖంలో నిల్వ చేయబడిన ఈ నీరు చాలా పవిత్రంగా మారుతుందని.. వాస్తు దోషాలను తొలగిస్తుందని, దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని నమ్ముతారు.

భగవంతునికి స్నానం చేయించడం: ఇలా శంఖంలోని నీటితో భగవంతునికి అభిషేకం చేయవచ్చు లేదా స్నానం చేయించవచ్చు. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

మరొక పరిహారం: శంఖంలో నీటిని మాత్రమే కాదు.. శంఖాన్ని పువ్వులు లేదా బియ్యంతో నింపవచ్చు. బియ్యం లక్ష్మీ దేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కనుక శంఖంలో బియ్యాన్ని ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది.

శంఖం ఉంచడానికి ఇతర ముఖ్యమైన నియమాలు

దిశ: పూజ చేసే చోట శ్రీ విష్ణువు విగ్రహానికి కుడి వైపున శంఖాన్ని ఉంచడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రత్యామ్నాయంగా శంఖాన్ని ఈశాన్య దిశలో కూడా ఉంచవచ్చు.

ఆసనం: శంఖాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై ఉంచవద్దు. ఎల్లప్పుడూ శుభ్రమైన గుడ్డ (ఎరుపు లేదా పసుపు) మీద లేదా రాగి/ఇత్తడి పళ్ళెంలో పెట్టుకోవాలి.

ఎన్ని శంఖాలు ఉండాలంటే: పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు పెట్టుకోవడంలో నియమాలున్నాయి. ఎందుకంటే ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలను తగ్గిస్తుందని నమ్ముతారు. అయితే కొన్ని నమ్మకాల ప్రకారం.. పూజ కోసం ఒకటి, ఊదడానికి మరొకటి ఉంచడం సముచితం

విరిగిన శంఖం: విరిగిన, పగిలిన లేదా ముక్కలుగా చీలిపోయిన శంఖాన్ని ఎప్పుడూ ఇంటిలో లేదా పూజ గదిలో ఉంచకూడదు.

Related posts