SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: తెల్లారి పొలానికి వెళ్లే రైతులకు రోడ్డుపై ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా



ఆదివారం కాదు.. అమావాస్య అసలే కాదు.. అయినా క్షుద్రపూజల కలకలం రేగింది. తెల్లవారేసరికి పొలాలకు వెళుతున్న స్థానికులు పెద్ద పెద్ద బొమ్మలు చూసి భయాందోళనకు లోనయ్యారు. గతంలో ఏదో చిన్న చిన్న ముగ్గులు వేసి ఆదివారం అమావాస్య రోజు పూజలు చేయడం చూసిన స్థానికులు.. ఈసారి పెద్ద మనిషి బొమ్మలు వేసి ఉండటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.


పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని వేమవరం నుండి చెన్నాయపాలెం వెళ్లే రహదారి మార్గం గుండా వెళ్లే పొలాల దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఐదు అడుగుల ఎత్తున్న రెండు మనిషి బొమ్మలను ముగ్గుతో వేశారు. ఆ బొమ్మలపై పసుపు, కుంకుమ చల్లారు. నిమ్మకాయలతో పూజలు చేశారు. కుంపటిలో దీపాలు పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే జంతు బలి ఇచ్చినట్లు ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఎవరో కావాలనే పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినట్లు స్తానికులు భావిస్తున్నారు.



గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసినట్లుగా భావిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. దసరా పండుగ కావడంతో గ్రామాలకు చాలామంది వచ్చి వెళ్లారని కొత్త వ్యక్తులు వచ్చినట్లు మాత్రం తాము గుర్తించలేదంటున్నారు. గతంలో గుప్త నిధుల వేటగాళ్లు ఎక్కువుగా సంచరిస్తుండేవారని ఈ మధ్యకాలంలో వారి జాడలు తగ్గిపోయాయంటున్నారు. అయితే క్షుద్ర పూజలు చేసిన వారిని గుర్తించి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందంటున్నారు

Also read

Related posts