SGSTV NEWS
CrimeTelangana

Telangana: అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా జరగరానిది జరిగింది.. కట్ చేస్తే.. అన్నదమ్ములిద్దరూ

 

దసరా పండగ వేళ సాధారణంగా ఉండే సంతోషాల సందడిని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆవిరి చేసింది. పేదరికంలో మగ్గుతున్న ఓ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఆశలు చిగురించిన ఆరు నెలలకే.. ఆ ఆశలకు రోడ్డు ప్రమాదం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


దసరా పండుగ నాడు అమ్మమ్మ ఇంటికి వంటకాలు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందారు. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన వేముల నాగరాజు(26) ఆరు నెలల కిందటే పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పేద కుటుంబానికి చెందిన నాగరాజు ఉద్యోగం సాధించడంతో వారి కుటుంబంలో వెలుగులు నిండాయి. తమ్ముడు కార్తీక్(24) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా పండుగ రోజున వండిన వంటకాలను తుంగతుర్తిలోని అమ్మమ్మకు ఇచ్చి తిరిగి సొంతూరుకు వస్తుండగా, బండ రామారం క్రాస్ రోడ్డు వద్ద వారి బైక్ అదుపుతప్పి బండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.


తొలుత సూర్యాపేట ఆసుపత్రికి అనంతరం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ నాగరాజు కూడా మృతి చెందాడు. కొడుకు పోలీస్ ఉద్యోగం సాధించాడన్న ఆనందం ఆ పేద తల్లిదండ్రులకు పూర్తిగా మిగలకుండానే, పెళ్లి కూడా కాని ఆ ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆ కుటుంబాన్ని, గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు డ్రైవర్‌గా స్థిరపడి కళ్ల ముందే తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషించింది. కానీ ఆ కుటుంబానికి , దసరా పండుగ రోజున ఇంతటి ఘోర విషాదం ఎదురైంది. తుంగతుర్తి పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts