SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra University : ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ మృతి – భగ్గుమన్న విద్యార్థులు- అసెంబ్లీలో స్పందించిన లోకేష్‌



Andhra University : ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. సరైన సదుపాయాలు ఉంటే బతికే వాడని విద్యార్థి సంఘాలు ఆందోళనబబాట పట్టాయి. దీనిపై లోకేష్ అసెంబ్లీలో స్పందించారు.

Andhra University : విశాఖలోని ఆంధ్ర యూనివర్శిటీలో దురదృష్టకరమైన ఘటన జరిగింది. మణికంఠ అనే విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. దీనిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు వైద్య సౌకర్యాలు లేవంటూ వీసీ కార్యాలయాన్ని ముట్టడించాయి. దీనిపై మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో స్పందించారు. క్యాంపస్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి సిద్దమని కానీ రాజకీయాలు చేయొద్దని సూచించారు. అలా చేస్తామంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాల ఆందోళన
ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వైద్య సదుపాయాలు సరిగా లేవని నినాదాలు చేశారు. అందుకే ఓ విద్యార్థి చనిపోయాడని ఆరోపించారు. అందుకే దీనిపై లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్ప వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఈ ఉదయం వీసీ ఛాంబర్‌ను ముట్టడించిన విద్యార్థులు అక్కడే బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేల మంది విద్యార్థులు ఉండే ఏయూలో కేవలం ఒకటే డిస్పెన్సరీ ఉందని అందులో కూడా సదుపాయాలు లేవన్నారు. ఎవరు ఏ అనారోగ్య సమస్యతో వెళ్లినా డోలో మాత్రమే ఇస్తున్నారని అంతకు మించిన మందులు కూడా లేవన్నారు. సరైన సదుపాయులు ఉండి ఉంటే మణికంఠ బతికి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో ఆక్సిజన్, మందులు, అంబులెన్స్ లేకపోవడంతోనే తోటి విద్యార్థి చనిపోయాడని అన్నారు. దీనిపై వీసి, ప్రభుత్వం తమకు స్పష్టమైన లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో మాట్లాడిన నారా లోకేష్
ఆంధ్రయూనివర్శిటీలో జరుగుతున్న ఆందోళనలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో మాట్లాడారు. అనారోగ్యంతో విద్యార్థి చనిపోయినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటన గురించి తెలిసి బాధపడ్డామని పేర్కొన్నారు. దీనికి కారణమేంటీ, యూనివర్శిటిలో ఉన్న సమస్యలు ఏంటీ అన్నింటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. అంతే కానీ విషయాన్ని రాజకీయం చేయొద్దని విద్యార్థులకు సూచించారు. వచ్చి ప్రభుత్వంతో మాట్లాడితే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రోడ్లపై కూర్చొని, కార్యకలాపాలకు, తరగతులకు ఆటంకం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. విద్యాలయాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు.

అసలేం జరిగింది
ఆంధ్రయూనివర్శిటిలో బీఈడీ చదివుతున్న 23 ఏళ్ల మణికంఠ అనే విద్యార్థి చనిపోయాడు. శాతవాహన హాస్టల్‌ల బాత్‌రూమ్ ఉదయం పడి ఉన్నాడు. కాలు జారి పడిపోయాడని అంతా అనుకున్నారు.  తోటి విద్యార్థులు అతన్ని పైకి లేపారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటం కమనించి అంబులన్స్ రప్పించారు. ఏయూ డిస్పెన్సరీ అంబులెన్స్‌ వచ్చిన తర్వాత కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే విద్యార్థి వెంకటసాయి మణికంఠ చనిపోయినట్టు కేజీహెచ్‌ వైద్యులు చెప్పారు. బీఈడీలో మొదటి ర్యాంకు సాధించిన విజయనగరానికి చెందిన మణికంఠ ఇలా చనిపోవడం అందర్నీ కలచి వేసింది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన ఆ కన్నవాళ్లు గుండెలవిసేలా ఏడ్చారు. విద్యార్థి చావుకు సదుపాయాలు లేకపోవడమే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆక్సిజన్ ఉండి ఉంటే కచ్చితంగా మణికంఠ బతికేవాడని చెబుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళనబాటపట్టాయి.

Also read

Related posts