SGSTV NEWS
CrimeTelangana

Telangana News: విదేశాల్లో ఉంటూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే యత్నం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!



టాంజానియా దేశంలో ఉంటూ ఆదిలాబాద్‌లో ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సాప్‌ గ్రూప్‌లలో పోస్ట్ పెట్టిన ఓ వ్యక్తిని ఆదిలాబాద్ పోలీసులు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.


ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రౌడీషీటర్ కైంచి సలీం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టడంతో.. గత ఏప్రిల్ నెలలో అతనిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో అతన్ని అరెస్టు కూడా చేశారు. ఆ సంఘటనపై షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తి పోలీసులను కించపరిచేలా, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా విమర్శలు చేసి.. జిల్లాలోని ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగేలా పోస్టులు పెట్టాడు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు అతని పై కేసు నమోదు చేశారు. అయినా కూడా ఆ వ్యక్తి పద్దతి మార్చుకోకపోగా మరిన్ని పోస్టులతో రెచ్చిపోయాడు. దీంతో అతనిపై చట్టపరమైన చర్యలకు‌ సిద్దమయ్యారు ఆదిలాబాద్ పోలీసులు. వెంటనే అతని వివరాలు కనుకొన్నారు.


నిందితుడు టాంజానియా దేశంలో ఉండటంతో అప్పటికప్పుడు అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాలేదు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సుతో షేక్ ఇర్పాన్ పై ఇమిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. మంగళవారం టాంజానియా నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినట్టుగా సమాచారం అందడంతో ఇమిగ్రేషన్ అధికారులు అతనిని పట్టుకొని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జిల్లాకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదించడంతో నిందితుడిని జిల్లా జైలుకు తరలించారు.

నిందితుడి అరెస్ట్ కు సంబందించిన సమాచారాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు వివరించారు. ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా.. శాంతి భద్రత లకు, గొడవలకు దారి తీసేలా పోస్టులు పెట్టిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు‌. వాట్సప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో పోలీసులను కించపరిచేలా, విధులకు భంగం కలిగించేలా, మనోభావాలు దెబ్బతీసేలా పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఆదిలాబాద్ పోలీసులు. నిందితుడు షేక్ ఇర్పాన్ వద్ద నుండి పాస్ పోర్ట్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు

Also read

Related posts