ఏలూరు: శివుడు శీర్షాసనంలో (తలకిందులుగా)
ఉండటమేంటనుకుంటున్నారా..! మీరు చూస్తున్నది నిజమే. త్రేతాయుగంలో శంబరుడు అనే రాక్షసుడు మునుల తపోదీక్షలను భగ్నం చేస్తుండేవాడు. శంబరుని చేతిలో అపజయం పాలైన యమధర్మరాజు అవమాన భారంతో ఘోర తపస్సు చేశాడు. కానీ తపోనిష్టలో ఉన్న శివుడు యముని తపస్సును గుర్తించలేదు. అప్పుడు పార్వతీదేవి శక్తిని యముడికి ప్రసాదించి శంబరుని వధించేట్లుగా చేస్తుంది. అమ్మవారు తనపై చూపించిన కరుణకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని యమపురిగా నామకరణం చేశారు.
షణ్ముఖునితో పార్వతీ పరమేశ్వరులు కొలువు దీరిన మహాక్షేత్రం
కాలక్రమేణా యమునాపురంగాను, యనమదుర్రుగా రూపాంతరం చెందింది. యముని కోరిక మేరకు పార్వతీదేవి మూడునెలల పసికందైన షణ్ముఖునితో, శీర్షాసన భంగిమలో ఉన్న పతితో సహా ఇక్కడే ఆవిర్భవించారని చరిత్ర చెబుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులోని స్వయంభువుగా వెలసిన ఏకైక దివ్యక్షేత్రం పార్వతీ సమేత శక్తీశ్వరస్వామి ఆలయం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు శీర్షాసనంలో ఉన్న మహాశివుని ప్రతిమామూర్తిని చూసి తన్మయత్వం చెందుతారు.
