ఆలయాలలో తెరలు వాడటం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక పవిత్రమైన సంప్రదాయం. నిత్యం స్వామి వారికి నిర్వహించే సేవలకు అంతరాయం కలగకుండా, స్వామి వారిని అలంకరించడానికి అభిషేకాలు చేయడానికి తెరలను ఉపయోగించడ మన్నది ఆనవాయితీ. మరి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న తెరలు, శ్రీవారి గర్భాలయంతో పాటు పలు చోట్ల వినియోగిస్తున్న పరదాలు ఎన్ని.. ఎక్కడెక్కడ ఆ పరదాలున్నాయి.. శ్రీవారి సన్నిధిలో వాడుతున్న పరదాల విశేషాలేంటి.. తెరల వెనుక ఉన్న కథలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు. క్షణం పాటు మూలవిరాట్ దర్శనం కనిపిస్తే చాలు ఈ జన్మకు అనుకునే కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. వెంకన్న దర్శనం కోసం నిత్యం కొండకు వచ్చే భక్తులది ఒక్కొక్కరి ఒక్కో కోరిక. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సామాన్యుడు నుంచి సంపన్నుడు దాకా ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకునే భక్తులు కొందరు రూ.కోట్ల విలువ చేసి ఆభరణాలు, కానుకలు సమర్పిస్తే మరి కొందరు హుండీలో ముడుపులు చెల్లించి వట్టికాసుల వాడికి వడ్డీతో సహా చెల్లిస్తారు. మరికొందరు తమ కష్టాన్ని సైతం శ్రీవారికి కానుక మొక్కు తెచ్చుకుంటారు. ఏదో ఒక రకంగా స్వామివారి సేవలో తరించే భక్తుల్లో ఒకరు తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ వినియోగించే పరదాలు సుబ్రహ్మణ్యం తయారు చేసి కానుకగా సమర్పిస్తున్నవే. వృత్తి రీత్యా టైలర్ అయిన ఈ భక్తుడు ఇస్తున్న పరదాలనే టీటీడీ శ్రీవారి ఆలయంలో వినియోగిస్తోంది.
తిరుమల ఆలయంలోని బంగారు వాకిలి, ఘంటా మండపం, కులశేఖరపడి, ఏకాంత సేవ సమయంలో వేసే తెరలను తయారు చేస్తున్న సుబ్రహ్మణ్యం టీటీడీ ఏటా నాలుగు సార్లు పరదాలు సమర్పిస్తున్నాడు. మలయప్ప స్వామి వెంచేపు చేసే గంటా మండపం వద్ద వేసే తెరతో పాటు స్వామివారికి నైవేద్యం, అభిషేకం ఇతర కైంకర్యాలు నిర్వహించే సమయంలో కులశేఖర పడి వద్ద వేసే పరదా, రాత్రి స్వామివారి పవళింపు సమయంలో అర్చకులు నిర్వహించే ఏకాంత సేవకు వాడే తెర తోపాటు సుప్రభాత సమయంలో బంగారు వాకిలికి వేసే పరదా సుబ్రహ్మణ్యం తయారు చేసేవి కావడం విశేషం. ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి కి ఇలా ఏడాదికి నాలుగు సార్లు ఒక్కోసారి ఐదేసి పరదాలు తయారుచేసి టీటీడీకి అందజేస్తున్నాడు. పరదాల తయారీకి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకుని నెల రోజులకు పైగా కష్టపడి పరదాలను సిద్ధం చేస్తున్నాడు. ఇలా ఏడాది మొత్తము శ్రీవారి పరదాల తయారీలో గడుపుతున్నాడు.
భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పించిన ఆభరణాలను, కానుకలను శ్రీవారి భక్తులకు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నంలో పరదాలపై దేవతామూర్తుల చిత్రాలను పొందుపరుస్తున్నాడు. ఇలా దేవ దేవుడి పట్ల తనకున్న భక్తిని సుబ్రమణ్యం చాటుకుంటుండగా ప్రతి 3 నెలలకు ఒకసారి శ్రీవారి ఆలయంలో టీటీడీ పరదాలను మార్చుతోంది. దేవతామూర్తుల చిత్రాలతో ఆకట్టుకునే రంగులతో అందంగా అలంకరించిన పరదాలను టీటీడీ వినియోగిస్తోంది. ఇక శ్రీవారికి సమర్పించే తెరలు తయారీ సమయంలో నిష్ఠతో భక్తిశ్రద్ధలతో ఉంటూ తయారు చేస్తున్న సుబ్రహ్మణ్యం ఈ అవకాశం దేవదేవుడు తనకు కల్పించిన మహాభాగ్యంగా భావిస్తున్నాడు
