SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: ఛీ.. నీచుడా.. చెల్లి వరుసైన మహిళతో అఫైర్.. వద్దన్నందుకు అన్నను చంపిన తమ్ముడు..

నువ్వు నా తమ్ముడివి రా.. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని కాళ్లు పట్టుకొని వేడుకున్నా.. కనికరించకుండా సొంత అన్ననే కిరాతకంగా హతమార్చాడు ఓ నరహంతకుడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది. గజపతినగరం మండలం కొత్తబగ్గాంలో పసుపురెడ్డి శ్రీను, పసుపురెడ్డి చంటి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. అయితే అన్న పసుపురెడ్డి శ్రీను సెప్టిక్ ట్యాంక్ బిజినెస్ చేస్తుంటాడు. తన వ్యాపారం చేసుకుని తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. అయితే తమ్ముడు చంటి మాత్రం నేరాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు. గతంలో చంపిపై హత్య కేసులు కూడా ఉన్నాయి. అయితే చంటి చేసే నేరాలను తన అన్న శ్రీను విభేదించేవాడు. అలా అన్న తన నేరాలకు సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నాడని చంటి అతనిపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా గత కొన్నేళ్ల క్రితం నిందితుడు చంటి తనకు సోదరి వరుస అయిన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ వ్యవహారం పై తమ్ముడిని మందలించి మూడు లక్షల రూపాయలు జరిమానా వేసి మరోసారి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించాడు. అలా అప్పటి నుండి అన్న శ్రీనుపై మరింత పగ మొదలైంది.. ఎలాగైనా అన్నని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు చంటి.

అన్నను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు చంటి. ఇంతలో వినాయక నిమజ్జనం వచ్చింది. నిమజ్జనం కోసం శ్రీను ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు. అది గమనించిన చంటి తన అన్న అడ్డు తొలగించుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించాడు. వెంటనే తన స్నేహితుడు చాకలి రామచంద్రుడుకి విషయం చెప్ప హత్యకు స్కెచ్ వేశాడు. శ్రీను బయటకు వెళ్తున్నాడని తెలుసుకున్న చంటి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. నేను నీతో వస్తాను అని చెప్పి అన్నతో కలిసి బైక్‌ పై బయలుదేరాడు. ఆ తరువాత మందు పార్టీ చేసుకుందామని అన్నని ఒప్పించాడు. మందు పార్టీ వద్దకు తన స్నేహితుడు చాకలి రామచంద్రుడుని పిలిచాడు. ఇదంతా తెలియని శ్రీను కూడా తన స్నేహితుడు భాషాను పార్టీకి పిలిచాడు. అలా నలుగురు కలిసి ఊరు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో మందు పార్టీ చేసుకున్నారు.

అనంతరం పసుపురెడ్డి శ్రీను తన స్నేహితుడితో కలిసి బైక్ పై బయలుదేరాడు. వారి వెంటే చంటి కూడా తన స్నేహితుడు రామచంద్రుడుతో కలిసి మరో బైక్ పై వెళ్ళాడు. అలా రెండు బైకులు కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా చంటి.. అన్న శ్రీను బైక్ కు తన బైక్ ను అడ్డుగా పెట్టి గొడవకి దిగాడు.. ఈ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసుకొని శ్రీను పై దాడి చేశాడు. ఇది చూసిన శ్రీను స్నేహితుడు భాషా భయంతో పరుగులు తీశాడు. తరువాత చంటి – రామచంద్రుడు కలిసి శ్రీను పై మరొక సారి దాడి చేశారు. కత్తితో సుమారు 20సార్లు పొడిచి దారుణంగా హత మార్చారు.


అయితే.. ఇదంతా చూసి అక్కడినుంచి పారిపోయిన భాషా.. ఇంటి వద్దకు వెళ్లి శ్రీను భార్య జ్యోతితో ఈ విషయం చెప్పాడు.. దీంతో జ్యోతి పరుగు పరుగున తన భర్త వద్దకు వచ్చింది. అప్పటికే శ్రీను తుది శ్వాస విడిచాడు. వెంటనే జ్యోతి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Also read

Related posts

Share this