నూజివీడు త్రిపుల్ ఐటీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆగ్రహించిన ఎం.టెక్ విద్యార్థి పురుషోత్తం, సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేశాడు. సహచర విద్యార్థులు సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో హాజరుపరిచారు.
నూజివీడు త్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడ్డ ఎంటెక్ (ట్రాన్స్పోర్ట్) విద్యార్థి మజ్జి వినాయక పురుషోత్తంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయనగరానికి చెందిన పురుషోత్తం పరీక్ష రాయడానికి వచ్చాడు. అయితే సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజు డ్యూటీలో ఉండగా, హాజరు తక్కువగా ఉందని పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. సరిపడా హాజరు లేదని.. హెచ్ఓడీ అనుమతి తీసుకురావాలని సూచించారు.
తరువాత పురుషోత్తం హెచ్ఓడీని కలిసి అనుమతి కోరాడు. కానీ ఆయన కూడా పరీక్ష రాయడానికి అనుమతించలేదు. తిరిగి పరీక్ష హాలుకు వచ్చిన పురుషోత్తం, గోపాలరాజును మరోసారి సంప్రదించగా ఆయన కూడా నిరాకరించడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అంతేకాకుండా.. పురుషోత్తంను బయటకు పంపేందుకు సెక్యూరిటీ గార్డులను పిలిచే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రొఫెసర్‌పై దాడి చేశాడు.
ఈ దాడిలో గోపాలరాజుకు పలు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే సహచర విద్యార్థులు అప్రమత్తమై పురుషోత్తంను పట్టుకుని అతని వద్ద ఉన్న కత్తిని లాక్కుని.. గాయపడిన ప్రొఫెసర్‌ను ఆసుపత్రికి తరలించారు. పురుషోత్తం తన వెంట రెండు కత్తులు తీసుకురావడంతో ఇది ముందస్తు పథకం ప్రకారమే జరిగిన దాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎం.టెక్‌లో 70% హాజరు లేకపోవడంతో పరీక్ష రాయడానికి అనుమతి లేదని హెచ్ఓడీ చెప్పడంతో కోపంతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పురుషోత్తంపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, ఉద్దేశ్యపూర్వకంగా ఎప్పుడూ విద్యార్థుల చెడును కోరుకోరని అన్నారు. విద్యార్థులు హింస, నేరప్రవృత్తిని ప్రోత్సహించరాదని, ఉపేక్షించరాదని స్పష్టం చేశారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు