SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: క్రికెట్ బంతి పడిందని పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు – కనిపించింది చూసి షాక్



హైదరాబాద్‌ నాంపల్లిలో ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న ఇంట్లో మానవ అస్తిపంజరం లభ్యం కావడం కలకలం రేపుతోంది. క్రికెట్ ఆడుతుండగా బాల్ ఆ ఇంట్లో పడటంతో.. తెచ్చేందుకు లోనికి వెళ్లగా అస్తిపంజరం కనిపించింది. మృతుడు అమీర్ ఖాన్ అనే వ్యక్తి అయ్యుండవచ్చన్న అనుమానంతో పోలీసులు డీఎన్ఏ టెస్టులు చేపడుతున్నారు.

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో మానవ అస్తిపంజరం బయటపడటం కలకలం రేపుతోంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ నివసించడం లేదు. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల స్థానిక బాలురు క్రికెట్ ఆడుతుండగా.. బంతి ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లారు. తలుపులు తీయగానే ఒక మానవ అస్తిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారిలో ఒకరు అస్తిపంజరం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన హబీబ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి ప్రాంగణాన్ని సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుడు అమీర్ ఖాన్ అనే వ్యక్తి అయ్యుంటాడన్న అనుమానం వ్యక్తమవుతోంది. వివాహం, ఆస్తి విషయంలో తన సోదరులతో గొడవలు జరగడంతో.. ఆయ‌న ఏడేళ్లుగా కుటుంబానికి దూరమయ్యాడు. కోవిడ్ కాలంలో అమీర్ ఖాన్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యుల చెబుతున్నారు. అయితే పోలీసులకు ఎటువంటి అధికారిక మిస్సింగ్ ఫిర్యాదు నమోదు కాలేదని తెలుస్తోంది.

సంఘటన స్థలాన్ని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ స్వయంగా పరిశీలించారు. మృతుడు ఎవరో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్‌ బృందంతో పాటు డీఎన్ఏ టెస్టులు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. మంగళవారం అధికారికంగా పంచనామా జరగనుంది

Also read

Related posts

Share this