శ్రావణమాసం వచ్చేస్తోంది. జూలై 25 నుంచి ఆగస్టు 22 వరకు శ్రావణమాసం కొనసాగుతుంది. తెలుగు మహిళలు ఈ శ్రావణమాసం కోసం ఎంతో ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ మాసానికి విశిష్టత ఎక్కువ. వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి పూజలు ఈ మాసంలోనే చేస్తారు.
మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వస్తుంది. ఇక రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1న, మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు 8న, నాలుగవ శుక్రవారం ఆగస్టు 15న, ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22న వస్తుంది. ఈ ఐదవ శ్రావణ శుక్రవారంతో శ్రావణమాసం ముగిసిపోతుంది.
ప్రతి ఏటా రెండో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకుంటారు. కానీ ఈసారి మాత్రం మూడో శుక్రవారం అంటే ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకోవాలి. ఈసారి శ్రావణమాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసంలో చేసే పూజలు ఎంతో ఫలితాలను ఇస్తాయి. అలాగే దానధర్మాలు కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తాయి.
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ శ్రావణమాసాన్ని మహిళలు ఆచరిస్తారు. అయితే శ్రావణమాసంలో కొన్ని వస్తువులను మాత్రం దానం చేయకూడదు. వాటిని దానం చేయడం వల్ల మీకు పేదరికం చుట్టుముట్టొచ్చు. లేదా చెడు పరిణామాలు జరగొచ్చు. శ్రావణమాసంలో ఎలాంటి వస్తువులను దానం చేయకూడదో తెలుసుకోండి.
నలుపు రంగు వస్తువులు
శ్రావణమాసంలో ఎప్పుడూ కూడా నలుపు రంగు వస్తువులను దానం చేయకూడదు. నలుపు రంగు శని, రాహు గ్రహాలకు సంబంధించినది. శ్రావణమాసంలో నలుపు రంగు వస్తువులను వేసుకోవడం లేదా దానం చేయడం అనేది జీవితంలో ప్రతికూలతను తీసుకొస్తుంది.
ఇనుప వస్తువులు దానం
శ్రావణమాసంలో ఇనుప వస్తువులను కూడా దానం చేయడం పూర్తిగా నిషిద్ధం. ఇనుము శని గ్రహానికి సంబంధించినది. దీనివల్ల శని గ్రహం వల్ల అశుభప్రభావాలు పడే అవకాశం ఉంది. ఇంట్లో పేదరికం రావచ్చు. ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు.
పదునైన వస్తువులను దానం చేయడం
శ్రావణ మాసంలో ఎటువంటి పదునైన వస్తువులను దానం చేయకూడదు. ఇలా పదునైన వస్తువులను దానం చేస్తే శివునికి ఇష్టం ఉండదని చెబుతారు. ఇలాంటి దానం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తి చెందుతుందని కుటుంబంలో వివాదాలు పెరుగుతాయని అంటారు.
కాబట్టి ఇక్కడ చెప్పే మూడు రకాల వస్తువులను శ్రావణమాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ దానం చేయకండి. మీరు కూడా వేరే వారి దగ్గర నుంచి ఈ వస్తువులను దానంగా తీసుకోకండి. శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే మీ ఇంటికి ఆ శ్రావణ లక్ష్మి వచ్చి శుభాశీస్సులను అందిస్తుంది.
