వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే వారి వేధింపుల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మరో వ్యాపారి బలయ్యాడు. ఆయన చనిపోయే ఆడియో రికార్డు చేసి తన చావుకు ఎవరు కారణమో చెప్పారు. అంతేకాకుండా ఆ ఆడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు.
ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫైనాన్సియర్స్ అరాచకాలకు మన్యం జిల్లాలో ఓ వ్యాపారి బలయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో చోటుచేసుకున్న హృదయవిధారక ఘటన అందరినీ కలిచివేస్తుంది. స్నేహితుడు చేతిలో మోసపోవడంతో పాటు ఆర్థిక వేధింపులు తట్టుకోలేక వ్యాపారి ఇండూరి నాగభూషణరావు(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలూరు పట్టణంలోని తెలగవీధిలో నివసిస్తున్న నాగభూషణరావుకు భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈయన సుమారు 32ఏళ్ల క్రితం గురివినాయుడుపేట నుంచి సాలూరుకు వలస వచ్చి మామిడిపల్లి జంక్షన్‌లో ఎలక్ట్రికల్ షాప్ పెట్టాడు. అయితే నాగభూషణరావు అకస్మాత్తుగా తన షాప్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఒక ఆడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ ఆడియోలో అతడు సంచలన విషయాలను వెల్లడించాడు.
నాగుభూషణరావు తన వ్యాపార అవసరాల కోసం డబ్బివీధికి చెందిన వడ్డీ వ్యాపారి డబ్బీ కృష్ణారావు వద్ద 40 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోవడంతో నాగభూషణరావుకు చెందిన కోటి విలువైన ఎలక్ట్రికల్ షాపును కేవలం 75 లక్షలకు డబ్బీ కృష్ణారావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పు మినహాయిస్తే మిగిలిన 35 లక్షలలో 10 లక్షలు మాత్రమే చెల్లించాడు. ఆ తర్వాత తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్న షాపును నాగభూషణరావుకే నెలకు రూ.20 వేల అద్దె ప్రాతిపదికన ఇచ్చాడు. అంతేకాకుండా నాగభూషణ రావుకు ఇచ్చిన 10 లక్షలను అప్పుగా చూపించి.. దానిపై నెలకు పది వేల వడ్డీ వసూలు చేస్తున్నాడు. అయితే తన షాప్ అమ్మిన తరువాత తనకు ఇవ్వాల్సిన 35 లక్షలు ఇవ్వాలని ప్రాధేయపడ్డా ఇవ్వకపోగా అద్దె, వడ్డీ రూపంలో తిరిగి ప్రతినెల రూ.30వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు.
నాగభూషణరావుకు ఇంకా బయట అప్పులు కూడా ఉన్నాయి. దీంతో తాను చనిపోతే తన కుటుంబానికి కొంత మేలు జరుగుతుందని భావించి.. తనకు జరిగిన అన్యాయాన్ని వాయిస్ రికార్డ్ చేశాడు. నాగభూషణరావు తన ఆడియో రికార్డింగ్‌లో కృష్ణారావు తన డబ్బును తనకే అప్పుగా ఇచ్చి వడ్డీ వసూలు చేస్తూ ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టాడని.. ఈ మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. ఈ ఆడియోను కృష్ణారావుతో పాటు తనకు న్యాయం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వాట్సాప్ చేశాడు. అంతేకాకుండా రాతపూర్వకంగా తనకు జరిగిన అన్యాయాన్ని లేఖలో రాసి జేబులో పెట్టుకొని తన ఎలక్ట్రికల్ షాప్‌లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. నాగుభూషణ రావు మృతి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నాగభూషణరావు మృతితో వడ్డీ వ్యాపారి కృష్ణారావు తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డబ్బీ కృష్ణారావును కాపాడేందుకు పలువురు పెద్దలు రంగప్రవేశం చేసి బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపారు. పోయిన మనిషి ఎలా పోయాడు, ఉన్న మీరైనా బాగుండాలి కదా అని నాలుగు వైరాగ్యంతో కూడిన పదాలు అల్లి రాజీ కుదిర్చినట్లు తెలుస్తుంది. తనకు ముప్పై ఐదు లక్షలు రావాలని నాగుభూషణ రావు తన ఆడియో రికార్డులో స్పష్టంగా చెప్తుంటే పెద్దమనుషులు మాత్రం 18 లక్షలకు రాజీ కుదిర్చినట్లు విశ్వసనీయ సమాచారం. 18 లక్షల నగదు సెటిల్‌మెంట్‌తో కృష్ణారావుకు సంబంధం లేనట్లు కుటుంబసభ్యుల ద్వారా కేసు ప్రక్కదోవ పట్టించారు. జరిగిన వ్యవహారం రాతపూర్వకంగా మరణ వాంగ్మూలం రాసినా పోలీసులు వాటిని మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చేశారు. ఇదే వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషి చావుకి విలువ లేదా? ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించకపోగా కేసును పోలీసులే తప్పుదోవ పట్టిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల ఆరాచకాలపై పోలీసులు దృష్టి సారించాలని.. ఇతర కుటుంబాలకు అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also read
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత