SGSTV NEWS
CrimeTelangana

Toddy Shops: క్రైమ్ స్పాట్లుగా కల్లు కాంపౌండ్లు.. ఒంటరి మహిళలే టార్గెట్.. పాప కిడ్నాప్..



కల్లు కాంపౌండ్లు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. షాపుకు వచ్చే మహిళలను టార్గెట్ చేస్తున్న అపరిచితులు వారిని ట్రాప్ చేసి నగలు దోచుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా శంషాబాద్ లోనూ అలాంటి ఘటనే జరిగింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణలోని కల్లు కాంపౌండ్లు క్రైమ్ స్పాట్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా కల్లు కాంపౌండ్లకు వచ్చే మహిళలే టార్గెట్‌గా నేరాలు జరుగుతున్నాయి. కల్లు దుకాణాల వద్ద మహిళల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వారిని ఏదో విధంగా ట్రాప్ చేసి దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళలను సాటి మహిళలే ట్రాప్ చేసి నేరాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది.  కొన్నేళ్ల క్రితం కల్లు దుకాణాలనే అడ్డగా చేసుకొని అక్కడికి వచ్చిన మహిళలను ట్రాప్ చేసి.. హత్యాచారం చేసిన ఘటన గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో సంచలన రేపింది. 2019లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు మహిళలను ఇదే విధంగా ట్రాప్ చేసి అత్యాచారం చేసి హత్యలకు పాల్పడ్డ వ్యక్తిని నాగర్ కర్నూల్ పోలీసులు  అరెస్టు చేశారు.

ఇక 2021 లోను హైదరాబాద్ యూసఫ్ గూడలో ఉన్న కల్లు దుకాణానికి వచ్చిన వెంకటమ్మను ఓ వ్యక్తి హత్య చేశాడు. నిందితుడు వెంకటమ్మను ఆమె ఒంటి మీద ఉన్న వెండి ఆభరణాల కోసమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ రాములు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇదే యూసఫ్ గూడ రహమత్ నగర్ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగేందుకు వచ్చిన ఒక మహిళను ఇద్దరు వ్యక్తులు అపహరించి ఆమె కాళ్ళకు ఉన్న వెండి కడియాలు తీసుకొని ఆమెను దారుణంగా హతమార్చారు. కొన్ని నెలల క్రితం షాద్ నగర్‌లోనూ అచ్చం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కల్లు దుకాణానికి వచ్చిన గంగమ్మ అనే మహిళకు ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కలిసి మద్యం సేవించిన తర్వాత గంగమ్మ మత్తులోకి జారుకోగా.. ఆమె ఒంటిమీద ఉన్న నగలు దోచుకునేందుకు హీర్యా ప్రయత్నించాడు. మెలుకువలోకి వచ్చిన గంగమ్మ ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న బండరాయితో కొట్టి చంపేశాడు. ఆమె కాలికి ఉన్న మెట్టెలు తీసుకొని అక్కడి నుంచి  పరారయ్యాడు.

తాజాగా శంషాబాద్ వద్ద కల్లు కాంపౌండ్‌కు ఓ మహిళ తనతో పాటు తన కూతురుతో వచ్చింది. అదే కల్లు కాంపౌండ్‌కు వచ్చిన మరో మహిళ తల్లిని మాటల్లో పెట్టి కూతురిని కిడ్నాప్ చేసింది. ఆరేళ్ల పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో సైతం రికార్డయ్యాయి. కొద్ది గంటల క్రితమే ఈ కేసును పోలీసులు చేధించారు. వికారాబాద్ పరిసరాల్లో పోలీసులు చిన్నారిని క్షేమంగా గుర్తించి వారి తల్లికి అప్పగించారు. కిడ్నాప్‌కు యత్నించిన మహిళను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాధారణంగా మహిళలు కల్లు దుకాణాలకు వెళ్లే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. నిత్యం కల్లు తాగటం అలవాటు ఉన్నవారు మాత్రమే కల్లు కాంపౌండ్లకు వెళ్తారు. అయితే అక్కడికి వచ్చే మహిళలను టార్గెట్ చేసి కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కల్లు దుకాణాలకు వచ్చే మహిళల ఒంటిమీద ఉండే బంగరం, వెండి ఆభరణాల మీదనే వారి ఫోకస్ ఉంటుంది.. అప్పటికే మత్తులోకి వెళ్లిన మహిళలను ఏదో ఒక మాయ చేసి శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి నగలను దోచుకుని మహళలను హత్యలు చేస్తున్నారు

Also read

Related posts

Share this