పశ్చిమ బెంగాల్ కేంద్రంగా వ్యవస్థీకృత దందా
బంగ్లాదేశీ యువతుల అక్రమ రవాణా
ఇక్కడ వ్యభిచారం, ఇతర దందాలకు వినియోగం
కేసుల దర్యాప్తులో గుర్తించిన పోలీసు అధికారులు
హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్‌లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్…
బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్‌లో లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్…
ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్‌గా సరిహద్దుకు అటు-ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా… ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్‌కు కోల్‌కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు.
.హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు…
కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది.
Also read
- Sun Transit: గ్రహ రాజు రవి అనుకూలత.. ఆ రాశుల వారికి సమస్యల నుంచి విముక్తి
- Vastu tips for Mirror: ఇంట్లో వాస్తు దోషాలున్యాయా.. బెస్ట్ రెమిడీ అద్దం అని మీకు తెలుసా..!
- Andhra News: తండ్రి కోసం బుల్లెట్ బైక్ కొన్న కూతురు.. కానీ బైక్ తండ్రికి ఇచ్చేలోపే….
- Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు