వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ చోటా నేతగా చలామణి అయిన దేవీరావు – దాదాపు 300 మంది బాధితుల నుంచి లక్షల రూపాయలు కాజేసిన కిలేడీ
విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన దేవీరావు బృందం పోలీసులకు చిక్కడంతో వారి ఆగడాలకు బలైన బాధితులు బయటకు వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ చోటా నేతగా చలామణి అయిన దేవీరావును నమ్మి గ్రామీణ యువత పెద్ద సంఖ్యలో మోసపోయారు. దాదాపు 300 మంది బాధితుల వద్ద లక్ష నుంచి 15 లక్షల రూపాయల వరకు కాజేసిన ఆమెను ఒడిశాలో పట్టుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
కీలక పత్రాలు స్వాధీనం: విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన మహిళా వైఎస్సార్సీపీ నాయకురాలు ఈత దేవి రావు బృందం ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కింది. ఒడిశాలోని జైపూర్ రోడ్డులోని ఓ లాడ్జిలో మకాం చేసిన ఈత దేవిరావుతో సహా మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆమె నుంచి పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిరుద్యోగులు, వివిధ అవసరాలకు పనులను చేసుకోవాలనుకునే వారి వద్ద నుంచి ఆమె భారీగా సొమ్ములు వసూలు చేసేది. ఉద్యోగాలు, బదిలీలు వంటివే కాదు పెళ్లిళ్లు, ఫంక్షన్లు అని కూడా ఈమె డబ్బులు వసూలు చేసిన తీరు బాధితుల ఆవేదనను తీవ్రంగా పెంచింది. నిరుద్యోగ యువతీ యువకులు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత యువత లక్ష్యంగా ఈమె దందా కొనసాగేది. అవసరమైతే ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, వంటివి ఇచ్చి మరీ వారికి నమ్మకం కలిగించేది. ఇందుకోసం మధ్యవర్తులుగా పాస్టర్లను కూడా ఉపయోగించుకునేది. మాజీ సైనిక ఉద్యోగులనూ ఆమె మోసం చేసింది.
వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఫోర్జరీ సంతకంతో నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను తనకు డబ్బులు ఇచ్చిన వారిలో కొందరికి పంపిణీ చేసింది. మరికొందరికి రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగాలు వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి దందా నడిపింది. కొన్నిసార్లు బాధితులతో ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ పాల్పడి రెండు మూడు లక్షలు గుంజిన తర్వాత కూడా వారిని వదిలిపెట్టకుండా మరొక లక్ష ఇస్తే పని అయిపోతుందని నమ్మబలికి మరీ తీసుకునేది. డబ్బులు గట్టిగా అడిగిన వారికి 100 కోట్లు ఐటీ వాళ్లు సీజ్ చేశారంటూ మాయ మాటలు చెప్పేది.
300 మంది నిరుద్యోగుల నుంచి ఈ తరహాలో డబ్బులు తీసుకొని, వారు తిరిగి అడిగితే రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతోందనీ విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలలుగా తిరుగుతున్నా పోలీసుల నుంచి స్పందన కరవైంది. దేవీరావు ఆగడాలపై ఈటీవీలో కథనం ప్రసారం చేసిన తర్వాత నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్పందించి ఆరెస్ట్ చేయడానికి ప్రత్యేక చర్యలకు ఆదేశించారు. పోలీసుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగామని, దీనిపై చర్యలు ముమ్మరం కావడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈత దేవిరావుతో పాటు మరి కొందరు మోసగాళ్లు ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేయాలని బాధితులు కోరుతున్నారు.
Also read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!