April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

కిడ్నాప్‌ కేసులో ఆరుగురు అరెస్ట్‌..కార్లు, సెల్‌ ఫోన్లు, కత్తులు స్వాధీనం



తిరుపతి సిటీ : తిరుపతిలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసిన కేసును పోలీసులు శనివారం ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కార్లు, ఏడు సెల్‌ ఫోన్లు, నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్‌ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వివరాలను తిరుపతి డిఎస్‌పి శ్రీలత శనివారం మీడియాకు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జీవకోన ప్రాంతానికి చెందిన రాజేష్‌ తన భార్య సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలిసి నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్‌ మూడేళ్ల కిందట రాజేష్‌ వద్ద రూ.24 లక్షల నగదు అప్పుగా తీసుకున్నారు. డబ్బులు తిరిగి చెల్లించాలని భార్గవ్‌ను రాజేష్‌ కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో రాజేష్‌ తల్లికి రూ.1.5 కోట్ల ధనం వస్తుందని తెలుసుకున్న భార్గవ్‌, తన స్నేహితుడైన అరుణ్‌ కుమార్‌తో కిడ్నాప్‌కు ప్లాన్‌ వేశాడు. తీసుకున్న నగదు చెల్లిస్తానని చెప్పి అక్కారంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్దకు రావాలని నమ్మబలికారు. అతని మాటలు నమ్మిన మార్చి 28న రాజేష్‌ .. కుటుంబంతో కలిసి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న కిడ్నాపర్లు రాజేష్‌ కుటుంబాన్ని బంధించి నగదు డిమాండ్‌ చేశారు. చిత్తూరులో ఉన్న తమ బంధువుల ఇంటికి తీసుకెళ్తే నగదు ఇస్తానని రాజేష్‌ చెప్పారు. దీంతో వారంతా కారులో బయలుదేరారు. ఐతేపల్లె వద్దకు రాగానే రాజేష్‌ కారులో నుంచి దూకేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు దొరికిపోతామని భయపడిన కిడ్నాపర్లు చిత్తూరులో రాజేష్‌ తల్లిని, భార్యా పిల్లలను మరొక చోట వదిలేసి పారిపోయారు. కిడ్నాప్‌కు పాల్పడిన జీవకోనకు చెందిన సంగీతం భార్గవ్‌, తిమ్మినాయుడుపాలెం పంచాయతీకి చెందిన వట్టికుంట అరుణ్‌ కుమార్‌, శ్రీకాళహస్తి మండలం జోగరాజుపల్లికి చెందిన దామతోటి సాయి కుమార్‌, రేణిగుంట మండలం తిమ్మయ్య గుంటకు చెందిన బలిపాకు మణికంఠ, ఏర్పేడు మండలం ఇసుకతగేలికి చెందిన చీరాల ప్రకాష్‌, పెళ్లకూరు మండలం చిల్లకూరు హరిజనవాడకు చెందిన సిరియల గణేష్‌లను అరెస్టు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.

Also read

Related posts

Share via