చిత్తూరులోని గాంధీరోడ్డులో కాల్పులు కలకలం చెలరేగింది. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంటి ఓనర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.. తుపాకులు పట్టుకుని తెల్లారుతూనే యాక్షన్‌లోకి దిగిపోయారు.. మినీ వ్యాన్‌లో స్పాట్‌కి చేరుకుని దోపిడీకి అడుగులు వేస్తున్న టైమ్‌లో దొంగల కథ అడ్డం తిరిగింది..! బాధితుడి సమాచారంతో ఈ కంత్రీగాళ్లకు కౌంటర్‌గా పోలీసులు తుపాకులతో ఎంటరయ్యారు. దొంగల్ని పట్టుకునే ఆపరేషన్ సీరియస్‌గా సాగింది. ప్రాథమికంగా సస్పెన్స్‌ను తెరదించారు అధికారులు.
లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి తుపాకులతో ఆరుగురు ఆగంతకులు చొరబడ్డారు. వారు గాల్లోకి కాల్పులు జరపగా.. అప్రమత్తమైన ఓనర్.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను సీజ్ చేశారు. ఈ ఘటనలో ఓనర్ చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.
ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని.. మరో వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఈ ముఠాను పురమాయించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే గన్స్‌తో ఇంట్లో దోపిడీకి యత్నించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. దాదాపు 3 గంటల ఆపరేషన్ తర్వాత దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చోరీకి ముఠా ఏర్పాటు చేసిన ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా దుండగులు మారణాయుదాలతో ఉండటంతో.. ప్రభుత్వం ఆక్టోపస్ బృందాలను స్పాట్‌కు రప్పించింది. అయితే వారు వచ్చే లోపలే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఆపరేషన్ కంప్లీట్ చేశారు.
