చిన్నతనంలో స్నేహితులతో సరదాగా చేసిన చిల్లర దొంగతనం నేడు అంతర రాష్ట్ర దొంగగా మార్చింది. సెల్ ఫోన్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నా దొంగతనం అనే అలవాటు మాత్రం అతన్ని నిద్రపోనీయ లేదు. చివరికి కటకటాలపాలు చేసింది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి….
చల్లా ప్రతాపరెడ్డి అనే యువకుడు సెల్ టవర్ కంపెనీలో టెక్నికల్ ఇంజనీర్‌గా విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నాడు. ప్రతాప్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా వింజమూరు. డీజల్ మెకానిక్ ఇంజనీర్ కోర్సు పూర్తి చేశాడు. ఆ సమయంలో స్నేహితులు కూడా ఎక్కువగానే ఉండేవారు. స్నేహితులతో సరదా సరదాగా గడిపేవాడు. అలా ఉన్న సమయంలో మాటల సందర్భంలో చేతనైతే ఒక దొంగతనం చేయాలని ఫ్రెండ్స్ పందెం పెట్టారు. అలా పదిహేడేళ్ల వయస్సులోనే దొంగతనం చేశాడు. అలా దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం కొన్నాళ్ళు జువైనల్ హోమ్ లో కూడా గడిపాడు. అలా ప్రారంభమైన దొంగతనం తరువాత రోజుల్లో అలవాటుగా మారింది. ఆ తరువాత పలు సందర్భాల్లో మరో ఐదు చోట్ల దొంగతనాలు చేశాడు. కానీ దొంగతనం చేసిన ప్రతిసారి పోలీసులకు దొరికి జైలు పాలవుతూనే వచ్చాడు. తరువాత కొన్నాళ్లకు జైలు జీవితం కష్టంగా మరి ఇక దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు సత్ప్రవర్తన తో మెలగాలనుకున్నాడు. వెంటనే చేతిలో ఉన్న డీజల్ మెకానికల్ ఇంజనీర్ సర్టిఫికెట్ గుర్తొచ్చింది. ఎక్కడో పడేసిన ఆ సరిర్టిఫికెట్ దుమ్ము దులిపి ఉద్యోగాల వేటలో పడ్డాడు. ఓ మొబైల్ సెల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ కంపెనీ ఇంటర్వ్యూలో ముప్పై వేల రూపాయల ఉద్యోగం వచ్చింది. దీంతో ఆనందపడిన ప్రతాప్ రెడ్డి ఇక పాత గతాన్ని పక్కనపెట్టి కొత్త ప్రారంభించాలని భావించాడు. ఇవే మంచి రోజులుగా భావించిన ప్రతాప్ రెడ్డి జీవిత భాగస్వామిని చూసుకున్నాడు.
గతాన్ని ఎవ్వరికీ చెప్పకుండా ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఇద్దరూ కలిసి విజయనగరంలో కాపురం పెట్టారు. జీవనం సాఫీగా సాగుతున్నా సమయంలో తనలో దాగి ఉన్న దొంగతనం అనే వ్యసనం బుసలు కొట్టింది. దీంతో మళ్లీ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా విజయనగరం జమ్ములో నివాసం ఉంటున్న ఇనగంటి సూర్య నారాయణ అనే రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి ఇంటి మీద ఇతని కన్నుపడింది. సుమారు మూడు రోజులు ఆ ఇంటి వద్ద రెక్కీ చేశాడు. ఒక రోజు రాత్రి వారు ఇంటికి తాళం వేసి విశాఖ జిల్లా యలమంచిలికి వివాహం నిమిత్తం వెళ్లారు. అది గమనించిన ప్రతాప్ రెడ్డి ఇంట్లో దొంగతనానికి నిర్ణయించుకున్నాడు. దీంతో వెంటనే రిటైర్డ్ టీచర్ ఇంటికి చేరుకొని తలుపులు పగులగొట్టి, బీరువాలోని బంగారు ఆభరణాలు దొంగిలించాడు. మరుసటి రోజు ఇంటికి చేరుకున్న టీచర్ కుటుంబసభ్యులు తమ ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు తమకు దొరికిన ఆధారాల ప్రకారం దొంగతనాలకు పాల్పడిన చల్లా ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కటకటాలకు పంపారు. విషయం తెలుసుకున్న ప్రతాప్ రెడ్డి భార్య కన్నీరుమున్నీరు అవుతుంది. ఇప్పుడు జిల్లాలో ప్రతాప్ రెడ్డి ఘటన కలకలం రేపుతుంది
Also read
- BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!
- AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..
- AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
- Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు!
- Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!