March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: అర్థరాత్రి లింగోద్భవ వేడుకకు వెళ్లి వస్తున్న మహిళలు.. నడి రోడ్డుపై కనిపించింది చూసి షాక్



ఈ సమాజంలో దేవుడు ఉన్నాడని నమ్మేవారు.. దెయ్యం ఉందని కూడా నమ్ముతారు . అందుకే పూజలు, భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు చిల్లంగి, చేతబడి, క్షుద్ర పూజలు వంటివి ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి చూసిన స్థానికులు భయబ్రాంతులకు లోనవుతూ ఉంటారు. హేతువాదులు వీటిని మూఢనమ్మకాలనీ కొట్టిపారేసినా.. నమ్మేవారు మాత్రం తమకు ఏమవుతుందా అని మదనపడుతూ ఉంటారు. తమ వారికి చేతబడి చేశారనో, క్షుద్ర పూజలు చేశారనో.. దాడులు, హత్యలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపాయి.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశమంతటా శివనామస్మరణతో మారుమోగుతుంది. జాగరణలు, ఉపవాస దీక్షలు, శివాలయాల్లో పూజలతో అంతా భక్తి పారవశ్యంలో మమేకం అయ్యారు.అదే సందర్భంలో పాలకొండ నగర పంచాయితీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బుధవారం అర్థరాత్రి జరిగిన క్షుద్రపూజల పట్టణంలో తీవ్ర కలకలం రేపాయి. పాలకొండ గటాలడెప్పి వీధిలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికులను బెంబేలెత్తిస్తోంది. రోడ్డుపై ముగ్గులువేసి, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుడ్లు, బొగ్గులు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్థరాత్రి శివాలయం వద్ద లింగోద్భవం కార్యక్రమానికి వెళ్లి వస్తున్న మహిళలు ఈ ఘటనను చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగర పంచాయితీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. జరిగిన ఘటనపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి పరిణామాలకు ఇది దారితీస్తుందో అన్న భయంలో ఉన్నారు కాలని వాసులు. 3నెలల క్రితం కూడా ఈ ప్రాంతానికి దగ్గరలోని గెద్ద వీధిలో ఇదే తరహా ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా లేక గుర్తు తెలియని ఆకతాయిలు ఎవరైనా చేసిన పనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. సాధారణంగా వీధిలోని యువత అర్థరాత్రి బర్త్ డే వేడుకలు జరుపుకోవడం..  వీధిలో కేక్ కట్ చేసి సందడి చేయటం వంటివి చేస్తూ ఉంటారు. దీంతో వీధిలో అర్థరాత్రి కొంత అలికిడి జరిగినా స్థానికులు.. వాళ్లే అని లైట్ తీసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు స్థానికులు. ఏది ఏమైనా మహాశివరాత్రి పర్వదినం రోజున జరిగిన ఈ ఘటన పట్టణంలో పెను దుమారం రేపుతోంది.

Also read

Related posts

Share via