March 13, 2025
SGSTV NEWS
CrimeTelangana

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ దుర్మరణం



కీసర: బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి  చెందిన విషాద ఘటన సోమవారం రాత్రి యాద్గార్పల్లి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో జరిగింది. మృతుల్లో తమ్ముడికి వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా.. అంతలోనే రోడ్డు ప్రమాదం అతడిని బలిగొనడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీసర సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్జూడకు చెందిన గూడూరు చంద్రశేఖర్ (36) బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. తార్నాక ప్రాంతంలో టైలర్ గా పని చేస్తున్నాడు.

లాలాపేట శాంతినగర్లో ఉండే అతని సోదరుడు మత్స్యగిరి (27) విజయ డెయిరీలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సోమవారం తమ అల్లుడు శ్రీను (17)తోకలిసి సోమవారం యాద్గార్పల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇదే రోజు రాత్రి తిరిగి నగరానికి వెళ్తుండగా యాద్గార్పల్లి- చీర్యాల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మత్స్యగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు.

చంద్రశేఖర్కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది. అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via