March 15, 2025
SGSTV NEWS
Spiritual

Garuda Puranam: మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..? మరల జన్మ పొందేందుకు ఎంత సమయం పడుతుంది..?



హిందూ ధర్మశాస్త్రాల్లో మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుందనే విషయం గురించి వివరణ ఉంది. ఇందులో ముఖ్యంగా గరుడ పురాణంలో మరణాంతర జీవితాన్ని వివరించి ఆత్మ వెళ్తున్న మార్గాన్ని, దాని గమ్యాన్ని వివరించారు. మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది..? మరల జన్మ పొందేందుకు ఎంత సమయం పడుతుంది..? ఈ విషయాల గురించి తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు వివరించబడ్డాయి. మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో కూడా ఇందులో చెప్పబడింది. మానవుడు తన కర్మల ప్రకారం మరణానంతరం ఫలితాలను అనుభవిస్తాడు. జీవుడు పాపాలు చేసినా, పుణ్యాలు చేసినా, అవి అతని ఆత్మ ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. మరణించిన వ్యక్తి మరల జన్మ పొందుతాడా..? అదే నిజమైతే మరణం తర్వాత ఎంతకాలం తర్వాత కొత్త జన్మ పొందుతాడు..? గరుడ పురాణం చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని 13 రోజులు పఠిస్తారు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఆత్మ అసలు ఎక్కడికి వెళ్తుంది..? మరణించిన వారు మరల జన్మ పొందితే ఆత్మ కొత్త శరీరంలో ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది..?

గరుడ పురాణం ప్రకారం మరణం అనంతరం ఆత్మ యమలోకానికి తీసుకెళ్లబడుతుంది. అక్కడ యమధర్మరాజు ముందర ఆత్మ చేసిన పాప పుణ్య కార్యాలను లెక్కపెడతారు. పాపాలు ఎక్కువగా ఉంటే యమదూతలు ఆత్మను శిక్షిస్తారు. పుణ్యాలు ఎక్కువైతే ఆత్మ స్వర్గానికి చేరుకుంటుంది. మరణం తర్వాత ఆత్మ యమధర్మరాజును చేరుకునే వరకు 86,000 యోజనాల దూరం ప్రయాణిస్తుంది అని గరుడ పురాణంలో చెప్పబడింది.

మరణించిన వారు తమ కర్మానుసారం దైవ కోటలో శిక్షలందుకున్న తర్వాత వారి జన్మ ఎలాంటి జీవిగా ఉంటుందనే నిర్ణయం తీసుకుంటారు. తదుపరి జన్మ పాప కర్మలు, పుణ్య కర్మల ఆధారంగా నిర్ణయించబడుతుంది. మరణించిన వారు తమ కుటుంబ సభ్యులతో సంబంధం ఉంచుకోవాలంటే వారి పేరున శ్రాధ్ధ కార్యక్రమాలు చేయడం ద్వారా వారిని తలచుకోవచ్చు.

గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత 3 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో ఆత్మ కొత్త జన్మను పొందుతుంది. కొత్త జన్మ ఎక్కడ పొందాలో కూడా ఆత్మ గత జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టి నిర్ణయించబడుతుంది.

జీవుడు తన పాప, పుణ్య కర్మల ప్రకారం పునర్జన్మ పొందుతాడు. తదుపరి జన్మలో ధనికుడిగా పుట్టాలా, పేదవాడిగా పుట్టాలా, మంచి కుటుంబంలో పుట్టాలా, కష్టం ఎక్కువగా ఉండే జీవితంలో పుట్టాలా అనేది గత జన్మలో చేసిన కర్మలపై ఆధారపడి ఉంటాయి.

గరుడ పురాణం ప్రకారం జీవితానికి అసలు మూలం కర్మ. మనం చేసే మంచి పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. చెడు పనులు చెడు ఫలితాలను కలిగిస్తాయి. కాబట్టి మన జీవితాన్ని మంచి మార్గంలో నడపడం చాలా ముఖ్యం.

Related posts

Share via