February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

సంచలనంగా మారిన పారిశ్రామికవేత్త హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు

ఎదురుగా ఉన్నది పాలోడు కాదు. పగోడు అంతకన్నా కాదు. చిన్నప్పటి నుంచి ఆలనాపాలనా చూసిన తాత. లాలించిన అమ్మ. అటువంటి వారిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు కీర్తితేజ. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. ఏకంగా 73 సార్లు కసిగా పొడిచి తాతను చంపేశాడీ కిల్లర్ తేజ. అడ్డువచ్చిందని అమ్మను కూడా చూడగా ఆరుసార్లు పొడిచాడీ కిరాతకుడు.


పంజాగుట్టలో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త హత్యకేసులో పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. ఆస్తి కోసం సొంత మనవడే తాతను హత్య చేసినట్టు నిర్ధారించారు.  ఇతని పేరు కిలారు కీర్తి తేజ. ఇతని మెదడు నిండా క్రిమినల్‌ థాట్సే. అందుకే కిల్లర్‌ కీర్తితేజగా మారిపోయాడు. అమెరికాలో ఎంఎస్‌ చదివాడు. బంధాలు, బంధుత్వాల విలువలు తెలియవు. చెడు వ్యసనాలకు అలవాటుపడి పక్కదారి పట్టాడు. కుటుంబంతో ఉండకుండా విడిగా మణికొండలో ఉంటున్నాడు కీర్తితేజ.


వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖరజనార్దనరావు కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. జనార్దన్ రావుకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. జనార్దన్ రావు రెండో కూతురు కొడుకు కీర్తి తేజ. ఇటీవల తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్‌ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. అయితే తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తి తేజ తాతయ్యను డిమాండ్ చేశాడు. కీర్తి తేజ చెడు వ్యసనాలకు బానిస అవ్వడంతో డైరెక్టర్ పోస్టును ఇవ్వలేదు జనార్దన్ రావు . దీంతో తాతయ్యపై పగ పెంచుకున్నాడు.

పక్కా ప్లాన్‌తో జనార్ధన్‌రావు ఇంటికి వెళ్లిన కీర్తి తేజ తాతపై కత్తితో దాడి చేశాడు. 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు.  తండ్రిని తన కుమారుడే పొడుస్తుంటే చూసి షాక్ తిన్న కీర్తి తేజ తల్లి అతడిని ఆపే ప్రయత్నం చేసింది. దీంతో కన్నతల్లి అన్న కనికరం కూడా లేకుండా ఆమెను ఆరుసార్లు పొడిచాడు కిరాతకుడు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.


హత్య అనంతరం కీర్తితేజ ఏలూరుకు పారిపోయాడు. నిందితుడిని ట్రేస్ చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కీర్తితేజ మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి శాంపిల్స్‌ను టెస్టుకు పంపామన్నారు పంజాగుట్ట ఏసీపీ.  జనార్ధన్‌రావు హత్యకేసులో ఆయన కూతురు స్టేట్‌ మెంట్ రికార్డు చేశారు పోలీసులు. కీర్తితేజను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు పోలీసులు

Also read

Related posts

Share via