వారణాసి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గంగా హారతి. ఆ తర్వాత మణికర్ణిక ఘాట్. కానీ ఇవి మాత్రమే కాదు. కాశీ వెళ్లే ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన ప్రదేశాలు కాశీలో చాలానే ఉన్నాయి. కాశీ వ్యాప్తంగా ఎన్నో ఘాట్లు భక్తుల సౌకర్యార్థం ఉన్నాయి. అయితే ఒక్కో ఘాట్ కు ఒక్కో పురాణ చరిత్ర ఉంది. వీటి గురించి తెలుసుకుంటే నిజంగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రయాగరాజ్, కాశీ క్షేత్రాన్ని దర్శించుకునే వారు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..
కాశీ నగరం మహదేవుని త్రిశూలంపై నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందులో ముఖ్యంగా అక్కడ వెలిసిన పవిత్రమైన ఘాట్ ల గురించి తెలుసుకుని తీరాలి. మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ ఈ ఘాట్ల విశేషాలు తెలుసుకోండి.
ముక్తికి ద్వారం మణికర్ణిక ఘాట్..
మరణించిన వ్యక్తులకు ఇక్కడ దహణ సంస్కారాలు జరిగితే వారికిక మరు జన్మ ఉండదని నమ్ముతారు. అంతేకాదు పూర్వ జన్మ కర్మల నుంచి కూడా వారి ఆత్మ విముక్తి పొందుతుందంటారు. పార్వతీదేవి చెవిపోగు ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నాయి. జనన మరణ కాల చక్రాన్ని ప్రతిబింబించేలా నిరంతరం ఇక్కడ చితి మంటలు మండుతూనే ఉంటాయి.
దశాశ్వంద్ ఘాట్..
బ్రహ్మ దేవుడు ఇక్కడ పది అశ్వమేథ యాగాలు చేసిన కారణంగా దీనికి ఈ పేరు వచ్చిందని నమ్ముతారు. గంగా హారతికి ఈ ఘాట్ ప్రత్యేకం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ కమనీయ హారతిని చూసేందుకు వస్తుంటారు.
ఐదు నదుల సంఘమం.. పంచగంగ ఘాట్
గంగా, యమునా, సరస్వతి, కిరణ, ధూతప్ప వంటి ఐదు నదుల సంగమమే ఈ ఘాట్. పురాతన విష్ణు ఆలయ అవశేషాలను ఇక్కడ చూడొచ్చు. ఈ నదీ సంగమం ప్రపంచంలోనే ఎంతో అరుదైనదిగా చెప్తారు.
హరిశ్చంద్రఘాట్..
నీతి నిజాయితీలకు పెట్టింది పేరైన రాజు సత్య హరిశ్చంద్రుడి పేరును దీనికి నామకరణం చేశారు. పురాణాల ప్రకారం ఆయనే స్వయంగా ఇక్కడ దహన సంస్కారిగా పనిచేశాడట. ఇక్కడ నిత్యం మండే మంటలు జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని గుర్తుచేస్తంటాయి.
శివ స్వరూపమే కేదార్ నాథ్ ఘాట్..
కేదార్ నాథ్ ఘాట్ రూపంలో సాక్షాత్తు శివుడే ఇక్కడ కొలువై ఉంటాడని నమ్ముతారు. అందుకే దీనిని ఆ పరమ శివుడికే అంకితమిచ్చారు. దక్షిణాది నుంచి వచ్చే భక్తులకు ఈ ఘాట్ స్వాగతిస్తుంది. ఇక్కడుండే రాతి మెట్లు వివిధ రంగుల్లో ప్రకాశిస్తుంటాయి. దీనిని అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్తారు.
శివుడి కత్తి పడిన ప్రదేశమే.. అస్సీ ఘాట్
రాక్షసులను సంహరించిన తర్వాత శివుడు తన కత్తిని ఈ చోట పడవేశాడని నమ్ముతారు. దానిని అసి అంటారు. ఉదయం హారతి ఇక్కడ జరుగుతుంది. అస్సి, గంగ అనే నదులు ఇక్కడ సంగమిస్తాయి. దీనినే అగ్ని దేవుడి జన్మస్థలంగా పిలుస్తారు. శతాబ్దాల క్రితం జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఇక్కడున్న శివాలయం నదిలోకి ఒరిగిపోతూ ఉంది. ఈ ఆలయమే ఇక్కడి ప్రదాన ఆకర్షణ.
