February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాశ్

ఏజెన్సీలో ఇటీవల జరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హడావుడి చేసి.. భద్రతా సిబ్బందితో సెల్ఫీలు దిగాడు.

విజయనగరం  – సాలూరు, , మక్కువ, గరివిడి: ఏజెన్సీలో ఇటీవల జరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హడావుడి చేసి.. భద్రతా సిబ్బందితో సెల్ఫీలు దిగాడు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోలలో పవన్ కల్యాణ్ పర్యటనలో విజయనగరం జిల్లాకు చెందిన బలివాడ సూర్యప్రకాశ్ (41) పోలీసు దుస్తుల్లో హల్చల్ చేశాడు. శనివారం అతడిని పోలీసులు అరెస్టు చేసి సాలూరు కోర్టులో హాజరుపరిచారు. ఏఎస్పీలు దిలీప్ కిరణ్, అంకిత సురానా శనివారం రాత్రి ఈ వివరాలు తెలిపారు. 2005లో అతని తండ్రి దత్తిరాజేరు మండలంలో 9 ఎకరాల భూమి కొనేందుకు ఒప్పందం రాయించుకున్నారు. తండ్రి 2020లో మృతిచెందాక ఆ పత్రాలు దొరికాయి. ఆ భూమిని దక్కించుకోవాలనే దురుద్దేశం కలిగింది. 2024 జనవరిలో ఐపీఎస్కి ఎంపికయ్యానని స్నేహితులు, బంధువులకు చెప్పి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగొచ్చి ఆ భూమి గల రైతు బెదిరించడంతో వారు 90 సెంట్లు రాసిచ్చారు.

యూనిఫాంతో ఫొటోలు..

సూర్యప్రకాశ్ బొబ్బిలిలో బీటెక్, కర్ణాటకలో ఎంబీఏ పూర్తిచేశాడు. 2003-05లో ఆర్మీ సిపాయిగా పంజాబ్లోని 26వ రెజిమెంట్లో పనిచేశాడు. ఆ ఉద్యోగం వదిలేశాడు. మూడు నెలల క్రితం విజయనగరం వచ్చాడు. గతంలో తూనికలు-కొలతల శాఖలో పొందిన లైసెన్స్తో ఇన్స్పెక్టర్ అవతారమెత్తి అక్రమ వసూళ్లు చేశాడు. ఉపముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొన్నాడు. పవన్ కల్యాణ్ ఆవిష్కరించిన శిలాఫలకం, వ్యూపాయింట్ వద్ద ఎవరూ లేనప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. పవన్ పర్యటన ముగిసిన తర్వాత పోలీసులు, ప్రత్యేక బలగాలతో ఫొటోలు దిగాడు. తర్వాత ఆ ఫొటోలతో వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.

గరివిడిలో మూలాలు

సూర్యప్రకాశ్ స్వస్థలం దత్తిరాజేరు మండలం గడసాం గ్రామం. ఈ ఏడాది ఆగస్టు 15న గరివిడిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా చెప్పుకొన్నాడు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అప్పటి చీపురుపల్లి డీఎస్పీ తదితరులను కలిసి.. వారితో దిగిన ఫొటోలను వాట్సప్ గ్రూపుల్లో పెట్టేవాడు. వీటిని చూసిన స్థానికులు, పోలీసులు నిజమేనని నమ్మారు. ఇప్పుడు నకిలీ బాగోతం వెలుగులోకి రావడంతో అందరూ విస్తుపోతున్నారు.

Also read

Related posts

Share via