SGSTV NEWS
Andhra PradeshCrime

Crime  news: స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి



అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంట వెళ్లిన చిన్నారి పొరపాటున ఆ వాహనం కిందనే పడి చనిపోయిన హృదయ విదారక ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

కందుకూరు పట్టణం : అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంట వెళ్లిన చిన్నారి పొరపాటున ఆ వాహనం కిందనే పడి చనిపోయిన హృదయ విదారక ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కందుకూరు మండలం అనంతసాగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన మేరకు.. గోగినేని శ్రీకాంత్, నాగమణి దంపతులకు భార్గవ్, మోక్షజ్ఞ(2) ఇద్దరు కుమారులు. భార్గవ్ కందుకూరులోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. రోజూలాగే మంగళవారం ఉదయం ఆ చిన్నారిని పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి తనతో పాటే వెళ్లారు. చిన్నకొడుకు వారి వెంట పరిగెత్తుతూ రావడాన్ని ఆమె గమనించలేదు. భార్గవ్ బస్ ఎక్కేయడంతో డ్రైవర్ వాహనాన్ని తీయగా ఆ సమయంలో మోక్షజ్ఞ బస్సు ముందు ఉన్నాడు. దీంతో టైరు కిందపడి ఆ చిన్నారి నలిగిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మోక్షజ్ఞను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. చిన్నారి మృతదేహాన్ని పట్టుకుని ‘మీ కోసమే రోజూ 50 కి. మీ. వెళ్లి కష్టపడుతున్నా. లేరా నాన్న.. నువ్వే ఇలా  అయిపోతే ఇక కష్టపడి ఉపయోగం ఎందిరా’ అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్ఐ మహేంద్రనాయక్ తెలిపారు. బస్సులో క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు.

Also read

Related posts