February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: అతన్ని నేనే చంపాను.. ఎందుకంటే..? కువైట్ వెళ్లి, వీడియో విడుదల చేసిన ఓ తండ్రి..!




కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేశాడు ఓ తండ్రి.. కువైట్ నుంచి వచ్చి చంపి వెళ్లిపోయాడు. పైగా తానే హత్య చేశానంటూ సోషల్ మీడియోలో వీడియో పోస్ట్ చేశాడు.



అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఓ తండ్రి హతమార్చాడు. పోలీసులు సరిగా స్పందించకపోవడంతోనే ఇలా చేశానని, సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. తమకు న్యాయం కావాలంటూ ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో.. సరిగా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో ఓబులవారిపల్లిలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది.

ఒక్కోసారి బాధితులు ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారో తెలియజేసే సంఘటన ఇది. తన గారాల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, సరిగా స్పందించకపోవడంతో ఒక వ్యక్తి ఏకంగా కువైట్ నుంచి వచ్చి అతడిని హతమార్చాడు. తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో శనివారం(డిసెంబర్ 14) తెల్లవారుజామున దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు(50) దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రత్యక్షమైంది. అతడు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. తానే కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సోషల్ మీడియా వేదికగా వీడియోను పోస్టు చేయడం సంచలనమైంది.

కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తె(12)ను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు.

ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి, శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆడ బిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని.. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకపోవడంతోనే తాను ఈ హత్య చేశానని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share via