పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంతవైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.
“విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంత వైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది.
దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.
సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్‌హౌస్‌లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్