• ఆత్మహత్యకు యత్నించిన కుటుంబం
మృత్యువాత
• ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా నలుగురూ మృతి
• కాసిపేట గ్రామంలో తీవ్ర విషాదం
తాండూర్: ఆ ఇంటిల్లిపాది పాలిట
మృత్యుపాశమైంది. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే కుమారుడి అత్యాశ.. కుటుంబం బలవన్మరణానికి కారణమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం, అప్పులు అధికం కావడం, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకొని తాగిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంలో శివప్రసాద్(26)తోపాటు తల్లిదండ్రులు మొండయ్య(58), శ్రీదేవి(52), అక్క చైతన్య అలియాస్ చిట్టి(30) ఒక్కొక్కరుగా గంటల వ్యవధిలో నలుగురూ బుధవారం మృతిచెందారు.
యూట్యూబ్కు ఆకర్శితుడై..
శివప్రసాద్ బెల్లంపల్లిలో కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్గా పని చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ వైపు ఆకర్శితుడయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. తొలుత కాస్త లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరుసగా నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడంతో వడ్డీలు పెరిగి భారమయ్యాయి.
రూ.50 లక్షలకు పైగా..
అప్పులు పెరిగిపోవడంతో ఏడాది క్రితం కొంతకాలం శివప్రసాద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో అప్పులు రూ.50లక్షలకు పైగా పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల పేరుతో మరికొంత అప్పు చేయడంతో మోయలేని భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
వైకల్యం నుంచి శాశ్వత నిద్రలోకి..
చైతన్య పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. మరొకరి సాయం ఉంటే గానీ జీవనం సాగించలేని పరిస్థితి కావడంతో దగ్గరుండి చూసుకునేవారు. తామందరం లేకుండా కూతురు ఎలా జీవిస్తుందోనని, చివరికి ఆమె ఎవరికి భారం కాకూడదని ఆలోచించిన తల్లిదండ్రులు తమతోపాటే గడ్డిమందు తాగించి పేగుబంధాన్ని వెంట తీసుకెళ్లారు.
గ్రామంలో విషాదఛాయలు
మొండయ్య కుటుంబమంతా మృతిచెందడంతో కాసిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. మొండయ్య చిరు వ్యాపారంతోపాటు ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు విక్రయించడంతో అందరికీ సుపరిచితుడయ్యాడు. అందరితో కలిసిమెలిసి ఉండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నేరుగా కాసిపేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేయాలని బంధువులు నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలకు తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్కుమార్ పంచనామా నిర్వహించారు. కాగా, మృతుడు శివ ప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Also Read
- నేటి జాతకములు 13 డిసెంబర్, 2024
- Saphala Ekadashi: సఫల ఏకాదశి ఈ నెల 25? లేదా 26నా? తేదీ, పూజా విధానం, మంత్రం, ప్రాముఖ్యత ఏమిటంటే
- విద్యార్థులను తీసుకెళ్తూ.. బ్రేకులు ఫెయిలైన ఆటో.. రెప్పపాటులో తప్పిన భారీ ప్రమాదం..!
- ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా కట్.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
- కొడుకు రాసిన మరణశాసనం.. వెంట పేగుబంధం!