November 22, 2024
SGSTV NEWS
Spiritual

శంఖం చరిత్ర



ఆధ్యాత్మికంగా శంఖం పవిత్రతకు చిహ్నం, శుభాలకు సూచిక, వైజ్ఞానిక ప్రయోజనాల ఖని. అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో పాలసముద్రం నుంచి అది బయటకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దానికే పాంచజన్యం అని పేరు. దాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించాడు. దాని తరవాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా ఆయనే స్వీకరించాడు.

ఆధ్యాత్మికంగా శంఖం పవిత్రతకు చిహ్నం, శుభాలకు సూచిక, వైజ్ఞానిక ప్రయోజనాల ఖని. అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సమయంలో పాలసముద్రం నుంచి అది బయటకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దానికే పాంచజన్యం అని పేరు. దాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించాడు. దాని తరవాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా ఆయనే స్వీకరించాడు. ముందుగా శంఖం, దాని వెంటే లక్ష్మీదేవి రావడంతో శంఖాన్ని లక్ష్మీదేవి అన్నగా, అదృష్ట వస్తువుల్లో ఒకటిగా చెబుతున్నాయి పురాణాలు. శం అంటే మంచి. ఖం అంటే ‘జలం’ అని అర్థాలు. అంటే జలాన్ని పావనం చేసేదని భావం. మామూలు నీటిని శంఖంలో పోసి అభిషేకం చేస్తారు. ‘శంఖంలో పోస్తేనే తీర్థం’ అనే నానుడి ఇలా పుట్టిందే.

దక్షిణావృత శంఖం కుడి వైపు తెరుచుకొని ఉంటుంది. దక్షిణావృత శంఖాలను పూజా విధానంలో వనరుగా వినియోగించరు. దైవ స్వరూపంగా భావించి వాటినే (దక్షిణావృత శంఖాలనే) పూజిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకూ రావని నమ్ముతారు. ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. దీన్ని పూజా విధానాల్లో తరచుగా వాడతారు. ఇవే కాకుండా శంఖాల్లో అనేక రకాలున్నాయి. ఆకారం, పరిమాణం, లక్షణాలను బట్టి మధ్యమావర్త, లక్ష్మీ, గోముఖ, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మ అనే పేర్లతో శంఖాలున్నాయి.

శత్రువర్గంతో యుద్ధానికి తలపడేటప్పుడు శంఖం పూరించడమన్నది యుద్ధ నియమాల్లో ఒకటి. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అర్జునుడి శంఖానికి దేవదత్తం అని పేరు. భీముడి శంఖం పేరు పౌండ్రకం. యుధిష్ఠిరుడి శంఖం అనంతవిజయం. నకులుడి శంఖం సుఘోష. సహదేవుడి శంఖానికి మణిపుష్పం అని పేరు. యుద్ధంలో విజయం సాధించాక దానికి సూచకంగా కూడా శంఖాన్ని పూరించడం ఒక ముఖ్యాచారం.

శంఖాన్ని ఊదడం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్య ఫలితాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. శంఖాన్ని ఊదడం వల్ల శరీరానికి వ్యాయామం కలుగుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటాయి. శంఖాన్ని ఊదడం వల్ల మెదడు చురుకుతనం పెరుగుతుంది. మనిషిలో రజో, తమో గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందని, అందువల్ల శంఖాన్ని పూరించడం గాని, ఆ ధ్వనిని వినడం గాని చేయాలని ఆయుర్వేద, యోగ శాస్త్రాలు సూచిస్తున్నాయి.

శంఖం ఊదడం వల్ల ఇంటి ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శంఖం పూరించేటప్పుడు వెలువడే ధ్వని, దాని కంపనాల వల్ల ఆ పరిసరాల్లో ఉండే క్రిమి కీటకాలు, వాతావరణంలో ఉండే రోగకారక క్రిములు నశిస్తాయని వైజ్ఞానికశాస్త్ర కథనం. శంఖాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఔషధ ప్రక్రియలుగానూ ఉపయోగపడతాయి.

              సేకరణ :  ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via