November 25, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పెళ్లికాని ప్రసాదులు జర జాగ్రత్త!..లేకుంటే మీరు ఇలానే..

భీమవరం బ్రోకర్లు..శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది. కానీ పెళైన వారం రోజులకే నవవధువు పారిపోయింది. నటుడు శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రంలో ఉత్తుత్తి బ్యాంక్, ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ స్టైల్‌ లో ఉత్తుత్తి పెళ్లి చేసి హిందూపురం కుర్రోడిని బురిడీ కొట్టించారు భీమవరం బ్రోకర్లు..


హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదన్న బెంగతో ఊరు కాని ఊరు వెళ్లి పెళ్ళిళ్ళ బ్రోకర్ల చేతిలో మోసపోయాడు. తన పెళ్లి చూడాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు భీమవరం పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా భీమవరం పట్టణంలోని సత్యవతి నగర్‌కు చెందిన నీలపు బాల అనే మహిళతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఏజ్ ఎక్కువ అవ్వడంతో ఎదురు కట్నం ఇస్తే తప్ప పెళ్లి కుదరదని భీమవరం బ్రోకర్లు చెప్పడంతో… వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులు చూడలేక వేమారెడ్డి పెళ్లికి ఒప్పుకున్నాడు.

పెళ్లిచూపులు చూడటానికి వెళ్ళిన వేమారెడ్డిని బ్రోకర్లు 4 లక్షలు అప్పటికప్పుడే వసూలు చేసి… ఆగమేఘాల మీద ఓ గుడిలో వేమారెడ్డికి… నీలపు బాలకు పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత వధువును తీసుకుని వేమారెడ్డి స్వగ్రామమైన రాచపల్లికి వచ్చాడు. పెళ్లి తర్వాత ఇంకేముంటుంది…. ఆ కార్యమే కదా.. తీరా కార్యం జరిపించాలని వేమారెడ్డి తల్లిదండ్రులు, బంధువులకు వధువు బాల లేనిపోని సాకులు చెప్పి వారం రోజులు కాలం వెళ్లబుచ్చింది.


వారం తర్వాత తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం వెళ్లాలని వధువు పట్టు పట్టింది. అదేంటి పెళ్లికి ముందు తల్లిదండ్రులు ఎవరూ లేరని చెప్పావు కదా అని వేమారెడ్డి నిలదీశాడు. దీంతో నవవధువు నీలపు బాల తనను తల్లిదండ్రుల దగ్గరికి పంపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. సరే నీతో పాటు నేను వస్తానంటూ వేమారెడ్డి తన భార్య నీలపు బాలను తీసుకుని భీమవరం వెళ్ళాడు.

తీరా భీమవరం రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత అక్కడొక డ్రామా స్టార్ట్ చేసింది నీలపు బాల. తాను పెళ్లి చేసుకున్న విషయం తన తల్లిదండ్రులకు తెలియదని… ఇంటికి రావద్దని… అమ్మానాన్నలను చూసి తిరిగి వచ్చేస్తానంటూ హడావుడిగా నీలపు బాల ఆటో ఎక్కి వెళ్ళిపోయిందట. ఇంటికి తిరిగి వచ్చిన వేమారెడ్డి రోజులు గడుస్తున్న తన భార్య తిరిగి రాకపోవడం… ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్‌లో ఉండడం… పెళ్లి చేసిన బ్రోకర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో… భీమవరం వెళ్లి ఆరా తీస్తే… అసలు తాను చేసుకుంది పెళ్లే కాదని… ఉత్తుత్తి పెళ్లి జరిగిందని వేమారెడ్డి తెలుసుకున్నాడు.  తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పెళ్ళికాని ప్రసాద్‌లుగా అయినా ఉండొచ్చు గానీ తనలా బ్రోకర్ల ఉచ్చులో పడి ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకొని మోసపోవద్దు బాధితుడు వేమారెడ్డి అంటున్నాడు

Also read

Related posts

Share via