మనిషి గుడ్డిగా నమ్మినంత వరకు మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. నమ్మడం ముఖ్యం కాదు.. అందులో నిజానిజాలు ఏంటో గ్రహించి ముందుగా జాగ్రత్త పడితే మరింత మంచిది..! ఇది చేస్తే మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుందని, ఈ పూజ చేస్తే మీకు లక్షల్లో డబ్బు వస్తుందని.. ఈ ఉంగరం ధరిస్తే మీకు ఇక తిరుగే ఉండదని చెబుతూ జనాల్ని మోసం చేసేవాళ్లు ఎంతో మంది ఉంటారు. అలాంటి ఒక దొంగ బాబానే తాజాగా సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ మహానగరం పాతబస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నూరి నగర్ అనే ప్రాంతం అది. అక్కడికి 12 ఏళ్ల క్రితం నారాయణపేట్ నుంచి వలస వచ్చిన మహమ్మద్ ఇలియాజ్ అనే ఓ వ్యక్తి బాబా అవతారమెత్తాడు. ప్రజల నమ్మకాన్ని అవకాశంగా మార్చుకుని అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. బాబా ఇలియాజ్‌గా పేరు మార్చుకుని ఎలాంటి సమస్యలు ఉన్నా క్షణాల్లో మాయం చేస్తానని నమ్మబలికాడు. పుట్టెడు కష్టాల్లో ఉన్న ప్రజలు ఆ బాబా చెప్పేది నిజమని నమ్మి, ఏం అడిగినా చేసేవారు. భార్య చెప్పిన మాటలను భర్తలు వినకపోయినా, సంతాన సమస్యలు ఉన్నా, అన్నదముళ్ల కేసులు, భూమి పంచాయితీలు అయినా ఎలాంటి వాటికైనా పరిష్కారం చూపిస్తానని మాయలు చేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో తనను నమ్మి సమస్యలు తీరుతాయని ఆశతో వచ్చే ప్రజలపై చేతబడి చేస్తూ వారి ఫోటోలను సేకరించేవాడు. ఆ ఫోటోలపై మేకులు కొడుతూ జీడి గింజలు, ఇతర చేతబడి సామాగ్రితో పూజలు చేసి భయం కల్పించేవాడు. అదే అదనుగా వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతూ గుట్టుగా జీవనం సాగిస్తున్నాడు. అమాయకులైన ప్రజలు కూడా చేతబడికి భయపడి ఆ దొంగబాబా అడిగినంత డబ్బులను ముట్టజెప్పేవారు. కాగా, బాబా ఇలియాజ్ చేతబడి చేస్తున్నాడన్న పక్కా సమాచారం అందడంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగారు. బాబాగా చెప్పుకుని ప్రజలను మోసం చేస్తూ చేతబడి చేస్తున్న అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం