November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: రాములవారి రథానికి నిప్పు.. అనంతపురం జిల్లాలో దుండగుల దుశ్చర్య



అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామంలో సీతారాములు, ఆంజనేయస్వామి ఆలయ రథానికి సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడం కలకలం రేపింది.



సమగ్ర దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశం పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు




అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామంలో సీతారాములు, ఆంజనేయస్వామి ఆలయ రథానికి సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడం కలకలం రేపింది. షెడ్డులో మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పి వేశారు. అప్పటికే రథం కొంతమేర కాలిపోయింది. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటనా స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. వివరాలు ఆరా తీశారు. కులం, మతం, గొడవలకు సంబంధించి జరిగిన ఘటన కాదని తేల్చారు. దేవాదాయశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. క్లూస్టం, జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు. షెడ్డు తలుపునకు వేసిన తాళం కోసి లోపలికి ప్రవేశించిన దుండగులు వస్త్రం చుట్టిన కర్ర సాయంతో రథానికి నిప్పు పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.

వర్గ విభేదాలతోనే..

2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, హనుమంతరెడ్డి, గోపాల్రెడ్డి, రామాంజనేయులురెడ్డి సోదరులు రూ.20 లక్షలు ఖర్చు చేసి రథం చేయించారు. గ్రామంలో ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న మరో వర్గానికి ఇది నచ్చక శ్రీరామనవమి ఉత్సవాలకు దూరంగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రథం చేయించిన వర్గం గ్రామస్థుల మన్ననలు పొందుతోందనే అక్కసుతోనే మరో వర్గం ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ముగ్గురు కీలక అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దర్యాప్తులో తేలిన వివరాలను ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే కాలవ

రథానికి నిప్పంటించిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాలిపోయిన రథాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే దురుద్దేశంతో ఈ ఘటన జరిగి ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also read

Related posts

Share via