SGSTV NEWS
Andhra PradeshPolitical

కౌన్సిల్‌ సమావేశంలో అధికారుల కొట్లాట..వీడియో



కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘటన

పిఠాపురం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ కౌన్సిల్‌ సమావేశంలో అధికారులు కొట్లాటకు దిగారు. కౌన్సిల్‌ సభ్యులు ఎదుటే మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.కనకారావు, డిప్యూటీ ఇంజినీర్‌ భవానిశంకర్‌ బాహాబాహీకి దిగడం విస్మయానికి గురిచేసింది. పిఠాపురం మున్సిపల్‌ కార్యాలయంలో వైస్‌ చైర్‌పర్సన్‌ పి.జ్యోతి అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల విషయంపై కౌన్సిలర్‌ బోను నానిబాబు మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రశ్నించారు. దీనిపై కమిషనర్‌ వివరణ ఇచ్చారు. డిఇ అందుబాటులో ఉండడం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇఇ సాయంతో పనులు చేయిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలోనూ ఆయన సెలవుపై వెళ్లిపోయారన్నారు. కమిషనర్‌ మాట్లాడుతుండగానే డిఇ కలుగజేసుకుని మాట్లాడారు. కమిషనర్‌ చెప్పేవన్నీ అసత్యాలని, అనారోగ్య సమస్యల వల్ల సెలవుపై వెళ్లానని తెలిపారు. అనంతరం విధులకు హాజరైతే అడ్డుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో తాను కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నానని తెలిపారు. దీంతో ఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఇది కాస్తా వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఒకానొక దశలో నియంత్రణ కోల్పోయి ఒకరిపై ఒకరు కొట్లాటకు దిగారు. కౌన్సిల్‌, మున్సిపల్‌ సిబ్బంది ఇరువురిని విడదీసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ ఆర్‌డి నరసింహారావు, కాకినాడ ఆర్‌డిఒ కిశోర్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. శాఖా పరమైన విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కమిషనర్‌, డిఇ నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకుంటామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పారు.

వీడియో

తాజా వార్తలు చదవండి

Related posts