శ్రీ కృష్ణాష్టమి విశిష్టత
*వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం*
*దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం॥*
శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే భగవంతుడు కృష్ణ పరమాత్మగా అవతారము ధరించిన రోజు. దానినే మనము కృష్ణ జయంతిగా భావిస్తున్నాము.
కృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేశారు. అప్పటివరకు అర్జునుని మనస్సు అంతా విషాదంతో దుఃఖంతో కలత చెంది వున్నది. అటువంటి అర్జునునికి జ్ఞానప్రాప్తి కలుగచేసి కర్తవ్య నిర్వహణకు గీతోపదేశం చేశారు.
రెండవ అధ్యాయంలో ఆత్మ స్వరూపమేమిటో తెలిపి, మూడవ అధ్యాయంలో కర్మయోగ ప్రయోజనం మొదలైన విషయాలను గురించిన ఉపదేశములు చేశారు.
భగవానుడు అర్జునునితో అంటారు – “నేను ఈ రూపంలో చెప్పుచున్న విషయాలు నీవు ఎరుగవు. ఎన్ని జన్మల తరువాత అర్జునునిగా జన్మించావో నీకు తెలియదు. నాకు సమస్తమూ తెలుసు. జన్మ అనేది అనేక జన్మలలో చేసిన ధర్మాధర్మ కార్యముల ఫలమును అనుభవించుట కొరకు అనే విషయాన్ని తెలుసుకో. నేను నా ఇష్ట ప్రకారము జన్మను పొంద గలను అనే విషయాన్ని గూడా గ్రహించు!”అన్నారు.
అప్పుడు అర్జునుడు – “మీ ఇష్ట ప్రకారం జన్మిస్తారు అంటే – మీకు ఎప్పుడు ఇష్టమౌతుంది?” అని అడిగాడు.
దానికి సమాధానంగా భగవానుడు-
*“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత* *అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ ||”*
అని భగవానుడు చెప్పాడు. అంటే ధర్మానికి ఎప్పుడు గ్లాని (పతనం) ఏర్పడుతుందో అప్పుడు నేను అవతారం ధరిస్తాను అని అర్ధం. ఇప్పుడు ఆ సందర్భం ఏర్పడింది. అందుచేత ధర్మమును సంరక్షించే టందుకు కృష్ణావతారం ధరించటం జరిగింది.
ఈ అవతారములో కృష్ణుడు అనితరమైన, అమానుషమైన ఎన్నో కార్యములు చేశాడు. తాను అవతరించిన వెంటనే మాతా పితలకు (దేవకీవసుదేవులకు) విశేషమైన దర్శనమిచ్చాడు. ఈ విధమైన ఎన్నో అమానుషశక్తులను ప్రదర్శించే సందర్భాలు వచ్చాయి.
దుర్యోధన పక్షపాతియైన అశ్వత్థామ పాండవ వంశనాశన ప్రతిజ్ఞ చేశాడు. ఉత్తరాగర్భస్థుడైన పరీక్షిత్తుని సంహరించటానికి బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది తిరుగులేని సంహారక దివ్యాస్త్రం. అటువంటి దివ్యాస్త్రాన్ని కృష్ణ భగవానుడు తన చక్రముతో మాయాలీలగా అడ్డుపెట్టి పరీక్షితుని రక్షించి పాండవ వంశ రక్షణచేశాడు.
ఆ అద్భుతాన్ని చూచి ద్రౌపది మొదలైన స్త్రీలు, పురుషులు అంతా కృష్ణుని శ్లాఘించి కీర్తించారు.
‘పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుని ఎందుకు రక్షించలేదు’ అని కొందరకు సందేహం కలుగవచ్చు. అభిమన్యుడు ధర్మబద్ధమైన, వీరోచితమైన కార్య నిర్వహణలో మరణించాడు. కాబట్టి అనివార్య పరిస్థితులలోనే అమానుష శక్తులను భగవానుడు ఉపయోగించటం జరిగింది.
యుధిష్ఠిరుడు ధర్మమునకు ప్రతిరూపమైనవాడు. దుర్యోధనుడు అధర్మాన్ని ఆశ్రయించినవాడు. శకుని జూదరి. ధర్మరాజు ద్యూతమునకు అంగీకరించినాడు. సమస్తము కోల్పోయాడు. భగవానునికి తెలియదా? అంటే అక్కడ అనివార్య పరిస్థితి ఏర్పడలేదు.
మరియొక సందర్భంలో ధర్మరాజు యొక్క ధర్మగుణాన్ని పరీక్షించుటకు దుర్వాస మహాముని శిష్యగణంతో అతిధిగా వస్తాడు. ధర్మరాజు ఆనందంతో ఆతిథ్యమిచ్చుటకు అంగీకరిస్తాడు.దుర్వాసమహాముని శిష్యగణంతో స్నానాది అనుష్ఠానాలకు వెళ్ళాడు. ఆ సమయానికి ద్రౌపది భోజన పాత్రలన్నీ కడిగి పెట్టేసింది. భోజన సౌకర్యం చేసే అవకాశమే లేదు.
అతిథులు స్నానాదికాలు ముగించుకొని ఆతృతతో భోజనానికి వస్తున్నారు. ద్రౌపదికి పాలుపోలేదు. కృష్ణభగవానుని తలచుకొని తులసి దళం సమర్పించింది.
దుర్వాసులవారు వచ్చారు. ధర్మరాజు సంకట స్థితిలో పడ్డాడు. కృష్ణభగవానుని లీలాప్రభావంతో దుర్వాస మహామునికి, శిష్య గణానికి కూడా కడుపులు ఉబ్బిపోయాయి. వారు భోజన ప్రసక్తే భరించలేని స్థితిలో పడ్డారు. ఆ పరిస్థితులలో ధర్మరాజును కాపాడకపోతే అనర్ధం చేకూరు తుంది. అటువంటిది జరుగ కూడదు. కనుకనే కృష్ణపరమాత్మ తన లీలా విలాసాన్ని చూపినారు.
ద్రౌపదీ వస్త్రాపహరణం సందర్భంలో కూడా పాతివ్రత్య మహిమను కాపాడి, దానిని లోకంలో సుస్థాపితం చేసే నిమిత్తమే ద్రౌపది ప్రార్ధనకు ఫలితంగా కృష్ణభగవానుడు తన లీలా ప్రభావంతో వస్త్రపరంపరను సృష్టించి మాన సంరక్షణచేశాడు. అది అనివార్య పరిస్థితి. రావణసంహారం తరువాత స్త్రీలకు ఏ విధమైన భంగము చేయబడలేదు. శ్రీరాముని పాలనలో ఎటువంటి దురాగతమూ జరుగలేదు. అది ధర్మరక్షణ.
కృష్ణభగవానుడు – “అర్జునా! దేవతలకు కూడా లభ్యము కాని నా విశ్వరూపాన్ని మానవులలో నీకొక్కనికే దర్శింప చేశాను” అన్నాడు.
‘అయితే పూర్వము తల్లియైన యశోదకు కూడా విశ్వరూపాన్ని చూపాడు కదా! మరి, మానవులలో నీ కొక్కనికే అంటే భగవానుడు చెప్పినది అసత్యమా?’
కాదు..!
ఎందుచేతనంటే మానవులనగా స్త్రీ, పుం లింగములు రెండూ రెండు వర్గాలవారు అని గ్రహించాలి. అందుచేత పురుషులలో అర్జునునకు స్త్రీలలో తల్లియైన యశోదకు అనే అర్థంలోనే భగవానుడు చెప్పినట్లు మనము గ్రహించాలి.
అందుచేత సందర్భానుసారంగా భగవానుడు తన అమానుష శక్తిని, సర్వజ్ఞతను, చాతుర్యమును ప్రదర్శించినాడు.
భారత యుద్ధంలో సైంధవుని సంహరించటం ఎవరికీ సాధ్యపడలేదు. అర్జునుడు సూర్యాస్తమయంలోపుగా అతనిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. యుద్ధం జరుగుతోంది. అర్జునుడు అసహాయ స్థితిలో వుంటాడు. ఆ సమయంలో భగవానుడు అర్జునునికి మర్మమైన విషయాన్ని జ్ఞాపకపరచి సైంధవుని తలభూమిపై పడకుండా జాగ్రత్తగా బాణాన్ని సంధించమంటాడు.
సైంధవుని తల నేలపై పడితే, ఆ విధంగా పడవేసిన వాని తల నూరు ముక్కలవుతుందని తండ్రి శాపం.
ఆ విధంగా అర్జునుని కార్యం సఫలమైంది. అనివార్య స్థితిలోనే భగవానుడు ధర్మరక్షణచేశాడు.
భారతయుద్ధం ముగిసిన తరువాత ధృతరాష్ట్రుడు కపట బుద్ధితో ధర్మరాజును పరామర్శించి, పరాక్రమ శాలియైన భీముని ఆలింగనం చేసుకోవాలి. ‘భీముడు ఎక్కడ?’ అని అడుగుతాడు.
సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయిన కృష్ణభగవానుడు లోహముతో నిర్మితమైన భీముని ప్రతిమను ధృతరాష్ట్రుని ముందు ఉంచుతాడు.
ధృతరాష్ట్రుడు తన బాహుపాశంలో లోహమూర్తిగావున్న భీముని ముక్కలుగా చేస్తాడు. అంతటి మహాబలశాలి ధృతరాష్ట్రుడు.
కృష్ణుడు అతని మనోగతము, శక్తి తెలిసినవాడు కాబట్టే ఆ విధంగా భీముని రక్షించాడు. ధృతరాష్ట్రుని కపట బుద్ధిని బహిర్గతం చేశాడు.
అటువంటి పరిస్థితులలో ధర్మ సంస్థాపన చేయటం కొరకే భగవంతుడు అవతారాన్ని ధరించవలసి వచ్చింది.
భగవద్గీతను లోకానికి అంద చేయటం జరిగింది. ధర్మరాజును కాపాడటం అంటే ధర్మాన్ని సంరక్షించినట్లు.
కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినమైన జన్మాష్టమి మనకందరకూ పవిత్రమైన రోజు. మనమందరమూ శ్రద్ధా భక్తులతో కృష్ణ భగవానుని స్మరించి పూజించాలి.
— జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*లోకా సమస్తా సుఖినోభవన్తు*
శ్రీ కృష్ణాష్టమి పూజా విధానం
శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు . కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుని చెరసాలలో జన్మించాడు.
చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకే ) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు,కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మాల, శ్రీ కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి.
పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమద్భాగవత పఠనం తో, శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.
కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, పవిత్ర మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.
కృష్ణాష్టమి రోజున బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేక బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేగాక ఈ పుణ్యదినాన భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.
శ్రీ కృష్ణాష్టోత్తర శత నామావళి
ఓం కృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః ॥ 10 ॥
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునా వేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనా జీవితహరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ॥ 20 ॥
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీత నవాహారాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగి మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః ॥ 30 ॥
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలతాలభేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ॥ 40 ॥
ఓం ఇలాపతయే నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః ॥ 50 ॥
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం వృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషణాయ నమః ॥ 60 ॥
ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః
ఓం నరకాంతకాయ నమః ॥ 70 ॥
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాల శిరశ్ఛేత్రే నమః
ఓం దుర్యోధన కులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః ॥ 80 ॥
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విధ్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకాయ నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హావతంసకాయ నమః ॥ 90 ॥
ఓం పార్థసారథయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహోదధయే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం పన్నగాశన వాహనాయ నమః ॥ 100 ॥
ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్థపాదాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్థాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః ॥ 108 ॥
ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళీ స్సమాప్తా ॥
Also read :
Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?
Krishnashtami 2024: కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? పూజా విధానం, శుభముహర్తం ఏమిటంటే..