అధ్యాయము 14
దత్తదాసునకు అభయ ప్రదానము
నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురవగడ్డ చేరగలనని చెప్పిరి. శ్రీపాదులవారిని భౌతికముగా ఎప్పుడు దర్శించెదనా అని మనమున ఎంతయో ఆతురతగా నున్నది. ఒక చేతిలో కల్లుముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయిననూ బ్రాహ్మణుడనయిన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనగుట చేతనూ, ఆ కల్లు వాసన నాకు ఎంత మాత్రము ఆమోద యోగ్యము కాని కారణముననూ, నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించెను. శ్రీపాదులవారి నామమును ఉచ్ఛరించుచూ వడివడిగా నడచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నా వద్దకు చేరెను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నము సలుపుట భావ్యమా? అని అతడు ప్రశ్నించెను.
అంతట ఓయీ! నీవెవ్వడవు? నాతో నీకేమి పని? అని నేనడిగితిని. దానికతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కల్లువాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చితివో? నీ పయనము ఎక్కడికో? తెలుసుకొనుట యుక్తమనెను. కల్లు నమ్ముకొనువారు గూడ యీ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్ధులు కాబోలనుకొంటిని. దారిన బోవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అచట చేరినది. ఆ కల్లు నమ్ముకొను వ్యక్తి, “అయ్యా! నేను యీ ప్రాంతములో కల్లు తీసుకొని అమ్ముకొనువాడను. ధర్మబద్ధముగా జీవించు వాడను. నాకు తాటిచెట్టే కల్పవృక్షము. నేను చెట్లునెక్కికల్లు తీసుకొని వచ్చునంత వరకును యీ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నాకొరకు వేచి యుండెను. నేను బ్రాహ్మణుడనయిననూ కల్లు త్రాగుటకు అలవాటు పడితిననియూ, చెల్లించుటకు తనవద్ద పైకము లేదనియూ, కాస్త కల్లుపోసి పుణ్యమును పొందవలసినదనియూ కోరెను. నేను వల్లె యంటిని. నేను కల్లు పోయుటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారము ఎక్కువగా నుండుటను గమనించి, నలుగురి ఎదుట కల్లు త్రాగినచో తన బ్రాహ్మణత్వమునాకు కళంకమేర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దానభంగమొనరించిన మహాపాపినౌదును. మా కులస్థులకు యిది అమృతముతో సమానమైనది. అంతటి అమూల్యమైన కల్లును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన యెడల విశేష పుణ్యము లభించును గదాయను ఆశతో నున్నాను, నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులయిన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది.” అనెను.
అచ్చట ప్రోగుపడిన వారందరునూ కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులైనందున తమసాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాచే బలవంతముగా కల్లు త్రావింపబడెను. తదుపరి వారందరునూ తలా ఒకదారిలోను పోయిరి. నాకు కల్లు త్రావించిన ఆ విచిత్రవ్యక్తి కూడా ఎటో పోయెను. నేను నా మనసులో “ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతార వరేణ్యుడయిన శ్రీపాదుని సందర్శనమునకు పోవుచూ నీచమైన కల్లును సేవిన్చితిని. నా బ్రాహ్మనత్వము మంట కలిసినది. పరమపవిత్రులైన శ్రీపాడులవారి ముఖమునెట్లు చూడగలను? నా ఖర్మ యిట్లు కాలినది. విధి బలీయమైనది. నా నుదుట యీ రకముగా వక్రలిపి లిఖించియుండ మరోవిధముగా ఎట్లు జరుగును?” అని కుమిలిపోసాగితిని.
నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖము నుండి దుస్సహమైన కల్లువాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దూషించుకొనుచు శ్రీపాడులవారి నామోచ్ఛరణము చేసుకోనుచూ నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కన్పించుచున్నది. అందు ఎవ్వరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించితిని. ఆ పవిత్ర తపోభూమిలో అడుగిడుటకు నాకు మనస్కరింపలేదు. అందుననూ, కల్లు త్రాగిన యీ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహునింద్యమని తలంచితిని.
నేను నా దారిన పోవుచుండ వెనుకనుండి ఒకవ్యక్తి చప్పట్లు చరచుచూ, “ఓయీ! శంకరభట్టూ! ఆగుము. నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానందస్వాముల వారి ఆజ్ఞ” అని ఉచ్చైశ్వరమున పల్కెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తీ దత్తానందస్వాముల వారి ఎదుట నిల్పిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీస్వామి నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములయిన ఫలముల నొసంగిరి. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరబిలిచి, “నాయనా! దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించిరి. వారిని నీవు కల్లు గీసుకోను గౌడ కులస్థునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కల్లుగా భ్రమించితివి! ఎంతటి విడ్డూరము!” అని పలికిరి.
నాకు తల తిరిగినంత పని అయినది. నేను చూచుచున్న విశ్వమంతయునూ నా కళ్ళముందే క్రమక్రమముగా అదృశ్యమగుచున్నట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగమువలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమును, అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగయినది. ‘నేను’ అనునది ఏమిటో తెలియరాని, తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయితిని. నాలోని పరిమితమైన ‘నేను’ అనునది నశింపగా యీ సమస్త సృష్టియూ కేవలము స్వప్నమువలె అనిపించసాగినది.
ఇంతలో శ్రీస్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్రభస్మమును నా నుదుటిపై తమ దివ్య హస్తములతో అద్దిరి. నేను ప్రకృతిస్థుడనయితిని. కొద్ది క్షణములపాటు నేను దివ్యానందమును అనుభవించితిని. ప్రకృతిస్థుడనయిన వెంటనే నేను స్థూలతత్త్వములోనికి కూరుకుపోయితిని అని తెలిసికొంటిని.
శ్రీస్వామి, “ఒకానొక జన్మమందు నీవు గౌడకులస్థుడవు. మిక్కుటముగా కల్లును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరములలో నీకు కల్లును త్రాగవలెననెడి కోరిక మిగిలియున్నది. శ్రీపాదులవారి అనుగ్రహమే లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైననూ, నీవు కల్లు త్రాగుటకు అలవాటు పడిపోయి పతన మయ్యెడివాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగనే వాటిని పరిహరించుచుంటిరి. శ్రీగురువుల మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినవి.” అని వివరించిరి.
అంతట నేను, “అయ్యా! శ్రీగురుని మహిమా విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొను కొలదిని ఇంకనూ తెలిసికొనవలెననెడి ఉత్సుకత మిక్కుటమగుచున్నది. శ్రీగురుడు పదే పదే తాను నృసింహ సరస్వతీ నామమున అవతరించెదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకోన ఉత్సాహము కలుగుచున్నది.” అని అంటిని. అందులకు స్వామి, “నాయనా! వేదఋషులయొక్క తత్త్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతస్సత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. “ఋతము” అనగా సత్యము. ఇదియే ఆత్మా సత్యము. వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయునపుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిరి. అదే విధముగా సరస్వతీ శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతీ నది అంతర్వాహినీ. దీనిని వర్ణించునపుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, మహావర్ణవమును తెలియజెప్పునదిగాను, మనయొక్క చిత్తములను ప్రకాశింప చేయునది గాను చెప్పబడినది. కావున శ్రీగురుడు ఒకానొక ప్రబోధకశక్తి, ప్రబోధీనా ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమొనరించెదరు. పరమసత్యమును, అంతర్ జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞము అనునది అంతః ప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతల కర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణములను, అశ్వములను ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద. అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందలి నిగూఢ అర్థము యోగ్యులయిన వారలకే తెలియపరచబడుటకు అత్యంత రహస్యముగా నుంచబడినది. యజ్ఞకార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వాక్యార్థమును చూచినయెడల వెన్న కాచిన నెయ్యి అయితే ‘ఘ్రుత’ శబ్దమునకు దీప్తి యని మరొక అర్థమున్నది. వేదమందు ‘గో’ శబ్దమునకు ‘వెలుగు’ అని అర్థమున్నది. అశ్వము శక్తికిని, ఆత్మబలమునకును, తపశ్శక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమైయున్న యశ్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను, సంతతిని కాంక్షించుచూ ఎన్నియో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్తమున్నది. పుత్రోత్పత్తి అనునది అంతః శక్తి జనకమునకు సంకేతము. దీనినే వారు ‘అగ్ని స్వయముగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు, అగ్ని యజ్ఞమున పుట్టిన సుతుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు’ వర్ణించిరి. అదే విధముగా సలిలము, ఉదకము అనునవి కూడా సంకేత అర్థములోనే వాడబడినవి. ‘సలిలం అప్రకేతం’ అనగా చైతన్యరహితమైన సముద్రము అనగా దైవత్వము అంతర్లీనమైయున్న జడాబ్ధి అను చీకటి సముద్రము నుండి తన స్వకీయశక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిరి. దీనినే మహా సముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తములో, సరస్వతి తన అంతర్ జ్ఞాన కిరణములలో ఊర్ధ్వసలిలములను మనకు గోచరింప జేయుచున్నదనిరి. వేదమునందు చెప్పబడిన సప్త స్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి ‘సలిలములందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని’ చెప్పియున్నారు. గోవులను హరించు దోపిడిగాండ్రను వృత్రులని దస్యులని పేర్కొనిరి. వృత్రుడు తేజస్సును అనగా గోవులను సలిలములను, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచకృత్యముల నోనగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు. తమశ్శక్తులు. సత్యజ్ఞానమును అన్వేషించువారికి ప్రబలవిరోధులు.” అని వివరించిరి.
ఔదుంబర వృక్షమునకు యిచ్చిన వరములు, నరసింహ సరస్వతి అవతార వైశిష్టము
నాయనా! శ్రీ మహావిష్ణువు హిరణ్య కశ్యపుని సంహరించుటకు ఔదుంబర వృక్షము యొక్క కొయ్య స్థంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించెను. ప్రహ్లాదుడు రాజయ్యెను. కొంతకాలము తరువాత రెండు ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్థంభము చిగుర్చుట నారంభించెను. అచ్చట ఔదుంబరవృక్షము రూపొండెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరమును పూజింపసాగెను. శ్రీ దత్తాత్రేయులవారు ఒకనాడు ఆ ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి, ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైతసిద్ధాంతమునందు ఆసక్తి యుండుటను గమనించిన శ్రీదత్తులు, నీవు కలియుగమున యతి వేషధారివై దీన జనోద్దరణ చేయగలవనియూ, ద్వైతసిద్ధాంతమును ప్రచారము చేయగలవనియూ వానిని ఆశీర్వదించిరి. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణకమలములపైబడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతట శ్రీదత్తులు “ప్రతీ ఔదుంబరమూలము నందును నేను సూక్ష్మ రూపమున ఉందును. నీ నుండి నరసింగాకృతి వెలువడిన కారణమున కలియుగము నందు నృశింహసరస్వతీ నామము వహించి అవతరించెదనని వాగ్దానము చేసిరి. ఇదంతయునూ పైంగ్య బ్రాహ్మణము నందు వర్ణింపబడినది. ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్తమహర్షుల తపోభూమియయిన హిమాలయము నందలి శంబలగ్రామ పరిసరములందు మాత్రమే నిలచియున్నది. మిగిలినచోట్ల లుప్తమైపోయినది. ఉన్నవా? లేదా? అను ప్రశ్న ఉదయించినపుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్థంభము నుండి ఆవిర్భవించిన ఆవేశావతారము శ్రీ నరసింహస్వామి. అదే విధముగా కలియుగమునందలి జనులు కల్మషచిత్తులై దైవమున్నాడా? లేడా? అను కుతర్కములు చేయునెడ తాను ఉన్నానని ఋజువుచేయుటయే గాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసెదననుటకు సూచన ప్రాయముగా వారు నృశింహ సరస్వతీ నామమున అవతరించెదరు.
అంతట శ్రీస్వామి వారిని “అయ్యా! మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదులు వారిని దర్శించితిరా! వారి బాల్య లీలలను వినుటకు మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది.” అని అడిగితిని.
శ్రీపాదుల వారి అద్భుత లీల
శ్రీస్వామి యిట్లు చెప్పసాగెను. నాకు చిన్నప్పటి నుండియూ నత్తి యుండెడిది. అందరునూ నన్ను హేళన చేయువారు. దీనికితోడు నాకు ఒక వింత జబ్బు పొడమినది. అయిదవ సంవత్సరము నుండి యీ జబ్బు ఉధృతమవసాగెను. ఒక్క సంవత్సరము గడుచుసరికి, పది సంవత్సరముల వయస్సు పెరిగినట్లుండెడిది. నాకు పది సంవత్సరముల వయస్సు వచ్చి నాటికి 50 సంవత్సరముల పైబడిన వృద్ధునికుండు లక్షణములు రాసాగెను.
శ్రీ పీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యములో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు యివ్వబడుచుండెను. విద్వత్తు కలిగినవారలకు, భూరిదక్షిణలు యీయబడుచుండెను. శ్రీపాదులవారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకొనిపోయెను. శ్రీపాదులవారి వయస్సు ఆరు సంవత్సరములు మించదు. యజ్ఞమున కవసరమైన ఘృతము సేకరింపబడెను. ఆ ఘృతము నంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనమునందుంచిరి. అతడు లోభియేగాక దురాశాపరుడు. ఘృతము నందలి ఒక వంతు భాగమును తన యింట రహస్యముగా దాచివేసి మిగతా మూడువంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను.
ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘ్రుతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు యిటువంటి విఘ్నము కలుగుత అందరికినీ చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంతవదనముతో శ్రీపాదులవారి నవలోకించిరి. అంతట శ్రీపాదులవారు, “నా ధనమును అపహరింపవలెనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట యీ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింప దలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకొని బయటకు వచ్చునపుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డుకర్రతో ఒకటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించువారి యింట జ్యేష్ఠాపత్నీ సమేతముగా శనైశ్చ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను.” అని పలికిరి. శ్రీపాదులవారి మాటలు ఎవరికినీ అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరుగబోవు సంఘటనలు గురించి చెప్పుచున్నారనుకొనిరి. ఇంతలో శ్రీపాదులవారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి, తాళపత్రముపై, “అమ్మా! గంగామతల్లీ! యజ్ఞ నిర్వహణ కవసరమైన ఘృతమును యీయవలసినది. నీ బాకీని మా తాతగారైన వెంకటప్పయ్యశ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ.” అని వ్రాయించిరి. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా నలుగురు పాదగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేదమంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరునూ చూచుచుండగనే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయెను.
మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు “కొంచెము సేపు ఆగుడు. మీ అబ్బాయి జబ్బును నివారించెదను. నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది. దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను.” అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘ్రుతమును అపహరించినందులకు ఏమయినా కీడు వాటిల్లునాయని అతడు లోలోన చింతించు చుండెను. తను ఘ్రుతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒకపరి యోచించుచుండెను. ఏదయిననూ , శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని ధృఢ నిశ్చయమునకు వచ్చెను. అపుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను.
శ్రీపాదులవారు: తాతా! నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు గదా! ఒక గృహమును పరశురామ ప్రీతీ గావింపవలెను. దానికి తగిన ముహూర్తమును నిర్ణయింప వలసినదనిరి. వృద్ధ బ్రాహ్మణుడు: గృహ నిర్మాణమునకు, శంఖుస్థాపనలకు ముహూర్తములుండును గాని, గృహ దహనములకు ముహూర్తములుండవు అనిరి.
శ్రీపాదులవారు: చౌర్యముచేయుటకును, గృహదహనములు చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండును?
వృద్ధబ్రాహ్మణుడు: అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమయినా వర్జ్యములు , దుర్ముహూర్తముల వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు.
శ్రీపాదులవారు: అయిన యెడల యిప్పుడు అటువంటి వర్జిత సమయమేమయినా జరుగుచున్నదా?
వృద్ధ బ్రాహ్మణుడు: ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది.
శ్రీపాదులవారు: తాతా! ఎంత శుభవార్త చెప్పితివి. పరమపవిత్రమైన యజ్ఞము కోసము సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు, ఆ యింటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు.
శ్రీపాదులవారి మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయెను. కొలదిసేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకొని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదులవారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ, ఆగ్రహించి నష్టమును కలుగజేయుటలోను సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకొని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులాజ్ఞాపించిరి. ఈ విధముగా మూడురోజుల పర్యంతము చేయమనిరి. మేము శ్రీ బాపనార్యుల యింత అతిథులుగా నుంటిమి. నా నత్తితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయెను. నేను స్వస్థుడనయితిని. శ్రీపాదులవారు తమ దివ్య వరదహస్తమును నా మస్తకము పైనుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసి, “ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేరా ప్రసిద్ధుడవయ్యెదవు గాక! గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించేడవు గాక!” అని ఆశీర్వదించిరి.
తదుపరి శ్రీపాదులవారు “ఓయీ! నీవును, ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలసి వ్యాపారము చేయుచుండెడివారు. వ్యాపారము నందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని యింటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించిటివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్రను నియోగించి నీ గృహమునకు నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యెను. గృహమునందలి నీ భార్యకూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయియుండుటను గాంచి గుండెనొప్పితో మరణించితివి. నీవు గతములో విషప్రయోగము చేసిన కారణమున యీ జన్మలో ఈ వింత వ్యాధికి లోనయితివి. నీ గృహమును పూర్వ జన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము యీ జన్మమున భస్మీపటలము గావించబడినది. మీ యిరువురిని, కర్మబంధముల నుండి నా యీ లీల ద్వారా విముక్తులను చేసితిని.” అని పలికిరి.
శ్రీపాదులవారి అనుగ్రహమును పొంది నేను యింటికి తిరిగివచ్చితిని. వేదశాస్త్రములందు పండితుడనయితిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి యిచ్చెను. శ్రీపాదులవారి ప్రమేయముతో మా యిర్వురి కర్మబంధములు విచ్ఛేదనమగుటచే అనంతర కాలమున యిర్వురుకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి, నత్తి కూడా పోయి పండితుడనయితిని, సాక్షాత్తు శ్రీ కృష్ణపరమాత్మ ఆధ్వర్యములో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటిదయ్యెను. శివుడు లేకుండా చేయబడిన దక్ష యజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మసూక్ష్మమును గుర్తెరుంగుట మంచిది.
నాయనా! శంకరభట్టూ! సకల దేవతలును తెజస్సంభూతులు. అదితి అనంతరూపిణి. ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని, పురోగమనమునకునూ వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్య పోషకులు. దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమునకు విఘ్నములను కలిగించు దుష్ట శక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది, వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. ఆశ్వమను శబ్దమునకు గుఱ్ఱము అని లౌకికార్థము. అయితే వేదఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును, మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించి ప్రాణమయ చైతన్యమునకు, జాజశ్శక్తికి, జీవశ్వాశశక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు, పశువులు మొదలయిన జీవరాశులవలెనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములయినవి కానేకావు. అవి సజీవములయిన జననోపచయ సంభూతములు. కొన్ని మూలబీజములనదగిన శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే. బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి, వేరువేరు జాతులు, వంశములు, కుటుంబములుగ వృద్ధి చెందినవి. పదముల సంప్యూహములందు ఒక్కొక్కదానికిని ఒక సమాన ప్రకాండము, మానసిక తత్త్వ చరిత్ర కలదు.
బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణము
వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రము కాదు. ప్రానేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క యింద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పధ్ధతి ప్రకారమే ప్రానేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధనా ప్రయోగము అనునది పరిణమించినది. నాయనా! దేవతలందరునూ మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతయునూ దైవాధీనమయి ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులయి ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనములై యున్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలైయున్నారు.
శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలయిన అత్యంత స్వల్ప పరిమితిగల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని శేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావవైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశితమైన నిష్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసికాంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు యీ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును.
పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్య చరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడినవాడవు. నీవు దానిని సంస్కృత భాషయందు రచించిననూ, అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెనుగున అనువదింపబడిననూ, పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే! శ్రీపాదుల వారి దివ్య చరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్ననూ శ్రీపాడులవారు అచ్చటనే సూక్ష్మ రూపమున యుండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను. సావధానముగా ఆలకింపుము.
శ్రీపాదుల వారు సప్తవర్షముల ప్రాయము వారయిరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల యిండ్లలో యిటువంటివి జరిగినపుడు ఎంతో సంరంభముండెడిది. శ్రీ బాపనార్యులవారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురము నందుండు దత్తదాసుడను మాలదాసరికి యీ మహోత్సవమును చూచుయోగము కలుగలేదు. అతడు పంచమజాతికి చెందిన వాడయినందున యీ అవకాశము కలుగలేదు. అతడు తన జాతి వారందరిని తన యింటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించెదమని చెప్పెను. వారందరునూ ఎంతో ఆసక్తితో వాని యింటికి చేరిరి. దత్తదాసు దత్తచరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. “పూర్వయుగములందు అనసూయామాతకును, అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే యీనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్యతేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీనజనోద్దారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శ్రీమంగళము అగును గాక!” ఇంతకంటె శ్రీగురుని గురించి చెప్పుటకు అతనివద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినువారలు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదులవారి అమృతదృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదులవారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తానూ మాలదాసరి యింటికి వెంటనే పోవలసియున్నదనిరి. అంతట శ్రీ బాపనార్యులు శ్రీపాదులవారిని కారణమడుగగా “విశుద్ధ అంతఃకరణుడయిన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసినవారికి యివ్వవలసిన సద్యః ఫలితమును వెంటనే అతనికి యివ్వవలసియున్నది” అని శ్రీపాదులనిరి.
శ్రీపాదుల భక్త వాత్సల్యమునకు జాతి కులములు లేవు
శ్రీపాదులవారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతి నీయలేదు. అంతట క్రోధావేశముతో శ్రీపాదులిట్లనిరి. “మీరు ఎవరినయితే పంచములని, నీచజాతివారని క్రౌర్యముతో అణచివేయుచున్నారో వారియందే నా కటాక్షము మెండుగా నుండి రాబోవు శతాబ్దములో వారు ఉన్నతస్థితియందుందురు. రాబోవు శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యము నందలి అధికాంశము సేవకావృత్తినవలబించి ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలాశాసనములు వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైననూ మార్చుటకు వీలుండదు.అయితే మీ బ్రాహ్మణ్యము నందు ఎవరయిననూ ధర్మబద్ధులై జీవించుచూ, దత్తభక్తిని కలిగినయెడల వారిని కంటికి రెప్పవలె కాపాడెదను.”
శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీజనకులు శాంతింప ప్రయత్నించిరి. కొలదిసేపటికి శ్రీపాదులవారు శాంతులయి మౌనము నవలంబించిరి.
సరిగా యిదే సమయములో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి.వారు ప్రేమతో సమర్పించిన మధురములయిన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్య హస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింటనున్న ప్రతీ ఒక్కరినీ శ్రీపాదులవారు ఆశీర్వదించిరి.
నాయనా! శంకరభట్టూ! చూచితివా? శ్రీపాదులవారి దివ్య ప్రేమ! వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో గాని, మరే విధమైన భౌతికములయిన విషయములతో గాని ప్రమేయమే లేదు. దత్తప్రసాదమును అంత్యకులజుడు సమర్పించిననూ భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన యెడల కష్ట నష్టములకు గురి యగుదురు.
శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయ వాక్యములు
శ్రీపాదులవారు దత్తదాసుని యింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము.
1 . నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోట నేను సూక్ష్మ రూపమున ఉందును.
2 . మనోవాక్కాయకర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలె కాపాడుచుందును.
3 . శ్రీ పీఠికాపురమున నేను ప్రతి నిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము.
4 . సదా నన్ను ధ్యానించువారి కర్మలను, అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయిననూ వానినన్నింటినీ భస్మీపటలము గావించెదను.
5 . అన్నమో రామచంద్రా అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనయ్యెదను.
6 . నేను శ్రీపాద శ్రీవల్లభుడను! నా భక్తుల యింట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును.
7 . నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును.
8 . నీవు ఏ దేవతాస్వరూపమును ఆరాధించిననూ, ఏ సద్గురువును ఆలంబనముగా చేసికొన్ననూ నాకు సమ్మతమే!
9 . నీవు చేయు ప్రార్థనలన్నియునూ నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను, నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందచేయబడును.
10 . శ్రీపాద శ్రీవల్లభుడనిన పరిమితమయిన యీ నామరూపము మాత్రమే కాదు. సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు.
11 . నాది యోగసంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరునూ నాయొక్క అంశలే.
12 . నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న యెడల నేను నీకు ధర్మమార్గమును, కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను.
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.