ముంబై, జులై 15: డబ్బు కలిగినోళ్లు, బలం కలిగినోళ్లు, నోరుగల్లోళ్లు ఏం చేసినా చెల్లుతుందని ఊరికే అనలేదు పెద్దలు. డబ్బున్నోళ్ల ఇళ్లల్లో ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచ మంతటా మారుమ్రోగేలా చాటింపువేస్తారు. ఇక పెళ్లిళ్లు, బర్తడే పార్టీలు, శీమంతాలు, పురుళ్లు, బారసారలు.. వీటికి సంగతి సరేసరి. చేవిలో మైకులు పెట్టి ప్రచారం చేస్తారు. అయితే తాజాగా జరిగిన అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక కూడా ఇలాగే పండలా చేశారు. మూడు రోజులు, 5 రోజులు, 7 రోజులు కాకుండా ఏకంగా 7 నెలలుగా వీరింట పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచమంతా చెప్పుకునేలా కనీవినని రీతిలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో కలిగినోళ్ల ఇళ్లల్లో పెళ్లిళ్లు కనీసం దూరం నుంచైనా ఎలా ఉంటాయో చూద్దాం అని సామాన్యుల నుంచి పెద్దొళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరినోళ్లే. అయితే అందరికీ ఈ ఛాన్స్ లేదు. ప్రత్యేకంగా తయారు చేసిన వెడ్డింగ్ కార్డులను పంపిన సెలబ్రెటీలకు మాత్రమే అంబానీల ఇంట పెళ్లి వీక్షించేందుకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం లేనివారికి నిర్మొహమాటంగా ప్రవేశం లేనట్లే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎలాగైనా అంబానీల పెళ్లి చూడాలని తెగ ఉబలాటపడ్డారు. అంతే.. పెళ్లి మండపానికి సరాసరి వెళ్లిపోయారు. దీంతో అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. ఏం జరిగిందంటే..
రిరిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, అపార కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుక శనివారం (జులై 13) అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబానికి చెందిన ముంబైలోని సెంటర్ జియో వరల్డ్ డ్రైవ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సినీ తాలరు, రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, క్రికెటర్లు పాల్గొన్నారు. దేశ దేశాల నుంచి అతిరథ మహారధులు విచ్చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో సహా మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే రియాలిటీ టీవీ దిగ్గజాలు కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరి ఖోలే, నైజీరియా సింగర్ రేమా, UK మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, సౌదీ అరామ్‌కో సీఈఓ అమీన్ నాజర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. ఎటు చూసినా ఖరీదైన మనుషులే.
Also read :ఫేస్ బుక్‌లో నకిలీ అకౌంట్.. అమ్మాయి పేరుతో పరిచయం.. కట్ చేస్తే..
అయితే, ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా ఏపీకి చెందిన యూట్యూబర్ వెంకటేష్ నరసయ్య అల్లూరి (26), స్థానిక వ్యాపారి లుక్మాన్ మహ్మద్ షఫీ షేక్ (28) అనే ఇద్దరు వ్యక్తులు అనంత్ అంబానీ హై-ప్రొఫైల్ పెళ్లి మండపంలోకి ప్రవేశించారు. అలా వెళ్లిన వీరిని నిమిషాల వ్యవధిలోనే ముంబై పోలీసులు పట్టుకుని, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చట్టపరమైన ప్రోటోకాల్ విధివిధానాల తర్వాత వారి చర్యకు అధికారులు నోటీసులు జారీ చేసి, అనంతరం విడుదల చేశారు.
Also read :ఫేస్ బుక్‌లో నకిలీ అకౌంట్.. అమ్మాయి పేరుతో పరిచయం.. కట్ చేస్తే..