రూ. 30 లక్షలు కట్నం ఇచ్చి.. పెట్టి పోతలు పెట్టి అత్తారింటికి పంపిన అమ్మాయిని.. పట్టుమని 15 రోజులు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి పంపేశాడు అల్లుడు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా..
గుండె కుడివైపు ఉందన్న నెపంతో పెళ్లైన పది హేను రోజులుకే వదిలేశాడు భర్త. అత్తామామలు ఇంట్లో నుండి గెంటేశారు. ఆరేళ్ల నుండి ఆమె పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోనకల్లులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు, అన్నపూర్ణల పెద్ద కుమారుడు భాస్కరాచారికి.. ఖమ్మం నగరానికి చెందిన వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె గంగాభవానితో 2018లో పెళ్లైంది. కట్నం కింద రూ. 30 లక్షలు ఇచ్చారు. పెట్టి పోతలు పెట్టి సాగనంపారు ఆమె తల్లిదండ్రులు. కానీ పెళ్లిన 15 రోజుల నుండి ఆమెను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు భర్త. అంతేకాకుండా గుండె కుడివైపు ఉందంటూ.. తనకు చెప్పకుండా పెళ్లిచేశారంటూ ఆమెను పుట్టింటికి పంపించేశాడు.
పలుమార్లు సంప్రదింపులు చేసినా ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. దీంతో 2019లో బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేసు విచారించిన న్యాయ స్థానం తీర్పు వెలువడే వరకు రూ. 15 వేలు మనోవర్తి ఇవ్వాలని ఆదేశించింది. అయితే భర్త నుండి ఎలాంటి ఆర్థిక సాయం రాకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. రూ. 10 వేలు మనోవర్తి చెల్లించాలని ఆదేశించినా పట్టించుకోలేదు భాస్కరాచారి. 2022లో ఖమ్మం కోర్టులో రాజీ కుదుర్చుకుని రూ. 13 లక్షలు ఇస్తానని అంగీకరించింది అతడి కుటుంబం. అయినా ఇవ్వలేదు. ఈ డబ్బులు గురించి అత్తాగారింటికి వెళ్లి అడిగింది. దీంతో కోడలిపై అత్తామామలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
తన గోడు మీడియాకు చెప్పుకోవడంతో ఈ విషయం వెలుగు చూ సింది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఆరేళ్లుగా బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. గుండె కుడివైపు ఉందన్న కారణంతో భర్త విడిచిపెట్టాడని, పెళ్లైన పదిహేను రోజుల నుండే వేధింపులు ఎక్కువయ్యాయనని తెలిపింది. తన మామ హెడ్ కానిస్టేబుల్ కావడం వల్లే తనకు న్యాయం జరగట్లేదని వాపోయింది. తనకు రావాల్సిన మనోవర్తి గురించి అడిగేందుకు వెళ్లినందుకు అత్తా, మామ తనపై దాడి చేశారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త భాస్కరాచారితో పాటు ఆమెపై దాడి చేసిన మామ, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, అత్త అన్నపూర్ణపై కేసు నమోదు చేశారు.