రేవణ్ణ ఇంట్లో ప్రజ్వల్ కేసులో సిట్ దర్యాప్తు
యశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్టయిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ఆయన ఇంటిలో సిట్ పోలీసులు పంచనామా చేశారు. బసవనగుడిలోని తండ్రి రేవణ్ణ ఇంటిలో పంచనామా చేస్తుండగా తల్లి భవాని అక్కడే ఉన్నా ప్రజ్వల్‌ను పలకరించలేదు. ప్రజ్వల్‌ను ప్రశ్నించడం ముగిసి కస్టడీకీ తరలించే ముందు బసవనగుడి నివాసంలో పంచనామాకు తీసుకెళ్లారు.
కొడుకును తీసుకొచ్చారని తెలిసి తల్లి భవాని ప్రజ్వల్‌కు ముఖం చూపించకుండా అవతలకు వెళ్లిపోయి తులసి చెట్టుకు పూజలో మునిగిపోయారు. పంచనామాకు ఆటంకం కలిగించవద్దని భవానికి పోలీసులు అంతకుముందే విన్నవించారు. బాధిత మహిళ అపహరణ కేసులో భవాని కూడా నిందితురాలే. ఆమెను కూడా పోలీసులు విచారించారు. ప్రజ్వల్ తనను ఫలానా గదిలో వేధించారని బాధితురాలు చెప్పడంతో ఆ గదిలో పోలీసులు సోదాలు సాగించారు.
వీడియో కెమెరా ఎక్కడ
అశ్లీల వీడియోలలో ఉన్నది తాను కాదని ప్రజ్వల్ చెబుతున్నారు. అశ్లీల వీడియోలలో ఈ గది పోలికలు కనిపించలేదని సిట్ వర్గాలు తెలిపాయి. బాధిత మహిళ చూపించిన జాగా, అశ్లీల వీడియోలో ఉన్న స్థలం ఒక్కటే అయితే ప్రజ్వల్ కేసు బలపడుతుంది. మరో పక్క వీడియో తీసిన అసలైన ఫోన్/ వీడియో కెమెరా కోసం సిట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. తన మొబైల్ పోయిందని ఏడాది కిందటే హొళెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రజ్వల్ చెప్పారు. ↑